Sep 20,2023 22:06

ధర్మవరంలోని నిరసన దీక్షలో పరిటాల శ్రీరామ్‌, తదితరులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు తెలపడానికి వెళుతుంటే నాయకులను ,కార్యకర్తలను అరెస్టు చేయడం న్యాయమా అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం పుట్టపర్తి మండల పరిధిలోని పైపల్లి గ్రామంలో వినాయకుని విగ్రహం, గ్రామంలోని నిడిమామిడమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరసనలు ప్రారంభించి నేటికీ ఎనిమిది రోజులు అవుతోందని అన్నారు. శాంతియుత నిరసనలు తెలియజేసే వారిని అదుపులోకి తీసుకోవడం సబబు కాదని, ఈ నిరసనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, ఆంధ్ర ప్రదేశ్‌ లోనే కాక దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారని ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రాలేదని తెలిపారు. మనం ఏ రాజ్యంలో ఉన్నాము అర్థం కాలేదన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన సాగుతుందని ఇది ఎంతో కాలం సాగదని త్వరలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ విజరు కుమార్‌, పై పల్లి సర్పంచి ప్రవీణ్‌ కుమార్‌, మాజీ సర్పంచులు మురారి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ :రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన సాగుతోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేదీక్షలు బుధవారానికి 8వరోజుకు చేరుకున్నాయి. పట్టణ బీసీ సంఘాల నాయకులు బోయరవిచంద్ర, బొట్టుకిష్ణ, సాయి, సంగాల బాలు, మహేశ్‌, పోతలయ్య, ఆచారీ, పూజారి సూరి, మల్లి, బిల్లేశీన, మందలనాగరాజు, శ్రీనివాస ఆచారీ, సత్యనారాయణ, సూర్యనారాయణ, తోటవాసుదేవలు రిలే నిరాహారదీక్షలు చేపట్టగా వీరికి పరిటాలశ్రీరామ్‌ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ చేపట్టే యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జగన్‌ లో వణుకుపుట్టిందన్నారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నిన చివరికి చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారన్నారు. కక్షసాధింపుతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
చెన్నేకొత్తపల్లి : టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.149కే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచామని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అదే వైసిపి ప్రభుత్వంలో 350 రూపాయలకు పెంచారని. దీనిని బట్టి ఎవరు అవినీతి చేస్తున్నారో ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారో అర్థమవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ బీసీ సెల్‌ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారని పరిటాల సునీత చెప్పారు.
ధర్మవరం టౌన్‌: ఏ తప్పు లేకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అనుచరులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు బుధవారం లక్షపోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టామని వారు చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళాజ్యోతిలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి అనంతరం పోస్టుకార్డుల ద్వారా నిరసన చేశారు. ఈ కార్యక్రమం గోనుగుంట్ల అనుచరులు - చిగిచెర్ల అరవిందరెడ్డి, తుంపర్తి పరమేశ్‌, నారాయణస్వామి, దేవేంద్రరెడ్డి, చిలకం సూర్యనారాయణరెడ్డి, బోడగల గిరిధర్‌, దుస్సాక్రిష్ణ, నబీరసూల్‌, గంధమనేని నారాయణస్వామి, డిజైనర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.
అగళి : చంద్రబాబును విడుదల చేసేంతవరకు తమ నిరసన కొనసాగిస్తామని టిడిపి మండల నాయకులు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో జరిగిన రిలే నిరాహారదీక్షలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని విర్శించారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఈ సైకో ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమేష్‌, మండల కన్వీనర్‌ కుమార్‌ స్వామి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి శివకుమార్‌, కోడిపల్లి సర్పంచి నరసింహమూర్తి, ఎంపీటీసీ చంద్రప్ప, నాగోజి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి క్రైమ్‌ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పుట్టపర్తి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో బుధవారం 8వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జిగా వచ్చిన బచ్చల పుల్లయ్య అధ్యక్షతన టిడిపి పార్టీ బీసీ సాధికార సభ్యులు పుట్టపర్తి టిడిపి పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు విడుదల అయ్యేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మైనార్టీ నాయకులు మహమ్మద్‌ రఫీ, నాయకులు శ్రీరామ్‌ రెడ్డి, నీళ్ల రమణ, బేకరీ నాయుడు, ప్రసాద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా పట్టణంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎంజిఎం పాఠశాల మైదానం నుంచి పుర విధుల గుండా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి కుతంత్రాలను విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జేవి అనిల్‌ కుమార్‌, నాయకులు కొల్లగుంట అంజనప్ప, డిఇ రమేష్‌ కుమార్‌, అమర్నాథ్‌, మహిళా నేతలు సుబ్బరత్నమ్మ, పరిమళ, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.