
ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : టిడిపి అధినేత అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బంద్ జరిగింది. కొన్ని సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. టిడిపి శ్రేణులు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు తలెత్తగా టిడిపితోపాటు జనసేన నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. మరోవైపు ముఖ్య నాయకులను పోలీసులు ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచడం, అదుపులోకి తీసుకోవడం వంటివి చేశారు. అయితే సత్తెనపల్లి, మాచర్ల, రెంటచింతల తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు.
బంద్‌లో భాగంగా గుంటూరు నగరంలోని పాఠశాలలు, కాలేజీలు, ఇంజీనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. అనేక ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్ కాలేజిలు ముందుగానే సెలవు ప్రకటించాయి. టిడిపి శ్రేణులు ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల వద్దకు వెళ్లి సోమవారం తరగతులు నిలిపేశారు. దీంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. బంద్‌తోపాటు ఉదయం వర్షం కురుస్తుండటంతో పాఠశాలలపై ప్రభావం పడింది. తాడేపల్లి పట్టణంలో టిడిపి శ్రేణులు అన్ని కార్యాలయాలు, సంస్థలనూ మూసివే యించి ఉండవల్లి సెంటర్‌లో రాస్తారోకో చేయడంతో విరమించాలని పట్టణ సిఐ శేషగిరిరావు కోరారు. అందుకు టిడిపి కార్యకర్తలు నిరాకరించడంతో వాగ్వాదం తలెత్తింది. పలువర్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నెహ్రుబొమ్మ సెంటర్‌లో దుకాణాలు మూయించే క్రమంలో పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం జరిగింది. మరికొందర్ని అరెస్టు చేశారు. పెనుమాకలో కె.శేషు ఆధ్వర్యంలో బంద్ చేశారు. ఉండవల్లి సెంటర్‌లో సిఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. తాడేపల్లి రూరల్ మెల్లంపూడిలో ప్రధాన రహదారిపై సిఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కుంచనపల్లిలో టిడిపి, జనసేన నాయకులు బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తుండగా పోలీసులు కొందర్ని స్టేషన్‌కు తరలించారు. రాజధాని ప్రాంతం తుళ్లూరులో టిడిపి, జనసేన శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. తాడేపల్లి నుంచి తుళ్లూరు వస్తున్న టిడిపి జిల్లా కార్యదర్శి తెనాలి శ్రావణ్ కుమార్‌ను పోలీసులు రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. పోలీస్ జీపు ఎక్కాలని కోరగా ఇందుకు కార్యకర్తలు, నాయకులు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. శ్రావణ్‌కుమార్ తుళ్లూరు చేరుకొని నల్లజెండాలతో చేపల్లిన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతు దీక్షా శిబిరంలో శ్రావణ్ కుమార్‌తోపాటు జనసేన మండల అధ్యక్షులు యెర్రగోపు నాగరాజు మాట్లాడారు. మంగళగిరిలోని పలు సెంటర్లో టిడిపి, జనసేన, ఎంఆర్ పిఎస్, సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. పాత టైర్లు, సిఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొంతమందిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మరికొంతమంది నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మంగళగిరి రూరల్ మండలంలోని పలుచోట్ల టైర్లు దహనం చేసి బంద్ పాటించారు. బంద్‌కు జనసేన, సిపిఐ, ఎంఆర్‌పిఎస్ మద్దతు తెలిపాయి. పలువురు టిడిపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బంద్ చేస్తుండగా మరికొందర్ని అరెస్టు చేశారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యవసాయం మార్కెటింగ్ యార్డులో క్రయ విక్రయాలు జరగలేదు. కొందర్ని పోలీసులు ఉదయం నుండే గృహనిర్బంధంలో ఉంచారు. మరి కొంతమందిని స్టేషన్‌కు తరలించారు. టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ చేసి పాఠశాలలు, కార్యాలయాలను మూయించారు. తెనాలి - విజయవాడ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. పెదకాకాని సెంటర్లో నిరసన తెలిపారు. దుకాణాలు, కార్యాలయాలు మూసేయించారు. బంద్‌కు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. తెనాలి పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. టిడిపి, జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బ్యాంకులు, షాపులను మూయించారు. సిఎం జగన్ దిష్టిబొమ్మలను గాంధీ చౌక్ కూడలిలో దహనం చేశారు. ఇదిలా ఉండగా జనసేన కార్యాలయంలో ఉన్న నాయకులను వెళ్లిపోవాలంటూ పోలీసులు దుర్భాషలాడారని ఆ పార్టీ జిల్లా నాయకులు కృష్ణమోహన్ విమర్శించారు. ప్రత్తిపాడులో టిడిపి నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మిగతావారు ఒక్కసారిగా పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను అరెస్టు చేయగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువుర్ని అరెస్టు చేసి నల్లపాడు రూరల్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అరెస్టయిన వారిని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.రామాంజ నేయులు పరామర్శించారు. కాకుమాను మండలం గార్లపాడులో సర్పంచ్ సురేష్ అధ్వర్యంలో సచివాలయాన్ని మూసేశారు. కొమ్మూరులో ప్రధాన రహదారిపై బైటాయించారు. పెదనందిపాడులో బంద్ ప్రశాంతంగా ముగిసింది. కొంతమంది రహదారిపై ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. చేబ్రోలు మండల వ్యాప్తంగా పాఠశాలలు మూతబడ్డాయి. వడ్లమూడి అడ్డరోడ్డు వద్ద, నారాకోడూరు సెంటర్లో, శేకూరులో టిడిపి శ్రేణులు రాస్తారోకో చేశారు. వడ్లమూడిలో మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. చేబ్రోలు కొమ్మమూరు కాల్వ వద్ద నిరసన తెలుపుతుండగా అదే సమయానికి అటుగా వస్తున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వాహనాన్ని టిడిపి శ్రేణులు అడ్డగించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కార్పొరేట్ విద్యాసంస్థలు, జెడ్‌పి పాఠశాలలు, దుకాణాలు మూతబడ్డాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయలు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మరికొందరు నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ఉదయాన్నే వెళ్లగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అన్నవరం, గోగులపాడు, సుబ్బయ్యపాలెం, యలమంద తదితర గ్రామాల్లో టిడిపి శ్రేణులు రాస్తారోకో చేశారు. వినుకొండ రోడ్డులోని జనసేన నియోజకవర్గ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సయ్యద్ జిలాని, మరికొందర్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి 7 గంటల తర్వాత విడుదల చేశారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులును ఆయన నివాసంలో నిర్బంధించేందుకు పోలీసులు భారీగా ముట్టడించారు. అయితే టిడిపి శ్రేణులు వారిని ప్రతిఘటించడంతో వాగ్వాదం తలెత్తింది. టిడిపి బంద్‌కు జనసేన, సిపిఐ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు టిడిపి శ్రేణులు బంద్ పాటిస్తుండగా పట్టణ సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని స్టేషన్ తరలించారు. పట్టణంలో కొన్ని సంస్థలు, దుకాణాలు స్వచ్ఛంద బంద్ పాటించగా మిగతావాటిని మూడు పార్టీల శ్రేణులు బైక్‌ర్యాలీ చేసి మూసేయించాయి. శివయ్య స్తూపం సెంటర్ వద్ద ఆందోళన చేశారు. అందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేసి నాయకులను అరెస్టు చేశారు. వీరంతా స్టేషన్ గేటు వెలుపల నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా నరసరావుపేట రోడ్డులోని చెక్క వాగు, చీకటిగలపాలెం బ్రిడ్జీల వద్ద టైర్లు కాల్చి రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలను అడ్డుకున్నారు. యడ్లపాడులో టిడిపి నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. సత్తెనపల్లిలోని తాలూకా కోర్టు బయట టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు నిరసన తెలిపారు. బంద్ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. 20 మంది వరకు నాయకులన్ని ముందస్తు అరెస్టు, గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో పట్టణంపై బంద్ ప్రభావం పడలేదు ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. పాఠశాలలు, కార్యాలయాలు పనిచేశాయి. ఇదిలా ఉండగా అరెస్టులను సిపిఎం ఖండించింది. అరెస్టయిన వారిని స్టేషన్‌లో సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు జి.మల్లీశ్వరి, ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, నాయకులు కె.శివదుర్గారావు, ఎ.వీరబ్రహ్మం, ఆర్.పురుషోత్తం, కె.సాయికుమార్ పరామర్శించారు. మాచర్లలోనూ బంద్ ప్రభావం కనిపించలేదు. కొందరు టిడిపి నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రెంటచింతలలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బంద్ ప్రభావం కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారాలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్‌లు కొనసాగాయి. ముప్పాళ్లలోని నర్సారావుపేట-సతైనపల్లి ప్రధాన రహదారిపై జిబిసి కెనాల్‌పై బైటాయించారు. కొందర్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పిడుగురాళ్లలో బంద్ పాక్షికంగా జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి, జనసేన నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న సెల్‌టవర్‌ను టిడిపి కార్యకర్త జి.కరుణాకర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలపగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్ సమీపంలో జనసేన నాయకులు నిరసన తెలుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు మహిళా నాయకులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బ్రాహ్మణపల్లిలో అద్దంకి - నార్కెట్‌పల్లి రహధారిపై టిడిపి శ్రేణులు బైటాయించాయి. పెదకూరపాడులో బ్యాంకులు, పాఠశాలలలను మూసేశారు. కొన్ని దుకాణాలు, సంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటించాయి. టిడిపి శ్రేణులు ప్రదర్శన చేశాయి. కొందర్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మండల అధ్యక్షులు రమేష్, మరికొందర్ని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ను గుంటూరులోని ఆయన నివాసంలో పోలీసులు ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచారు. నాదెండ్ల మండలంలో పలు గ్రామాల్లో బంద్ పాటించారు. పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు.