Jul 29,2023 20:52

డీఈవోతో చర్చలు నిర్వహిస్తున్న ఫ్యాప్టో నాయకులు

  కడప అర్బన్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలో పాల్గొనకూడదని జులై 15న జారీ చేసిన ఉత్తర్వులుపై జిల్లా విద్యాశాఖాధికారి వై. రాఘవరెడ్డి వెనక్కి తగ్గారు. తాను ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో డిఇఒ శనివారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. చర్చలలో ఫ్యాప్టో నాయకులు పలు అంశాలను అధికారి దష్టికి తెచ్చారు. ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు డిఇఒ తెలియజేయడంతో వివాద ముగిసింది. చర్చలలో ఫ్యాప్టో చైర్మన్‌ మాదన విజయకుమార్‌ ఇటీవల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో జరిగిన కొన్ని అవకతవకలను జిల్లా విద్యాశాఖాధికారి దష్టికి తీసుకురాగా వాటిని విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నష్టపోయి ఉంటే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులను దుర్భాషలాడుతున్న విషయాన్ని ప్రస్తావించగా, విద్యాశాఖను గాడిలో పెట్టాలని ఉద్దేశంతో అక్కడక్కడా కఠినంగా మాట్లాడానే తప్ప, ఉపాధ్యాయులను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, భవిష్యత్తులో స్నేహపూరిత వాతావరణంలో ప్రభుత్వ విద్యారంగ అభివద్ధికి కలిసికట్టుగా కషి చేద్దామని పేర్కొన్నారు. లెసన్‌ ప్లాన్‌ విషయంలో కూడా చేతిరాతతో తప్పనిసరిగా రాయాల్సిన అవసరం లేదని, సొంతంగా తయారుచేసిన డిజిటల్‌ కాపీలను కూడా వాడవచ్చని చెప్పారు. డిఇఒతో చర్చలు సఫలీకృతం కావడంతో ఆగస్టు 6న కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన ధర్నాను విరమించుకున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ట్రెజరర్‌ వై.వెంకట సుబ్బయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పి.రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు కె.బాలగంగి రెడ్డి,యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు, ఎపిటిఎఫ్‌(1938) జిల్లా అధ్యక్షులు టి.వెంకటేశ్వరరెడ్డి, ఎపిటిఎఫ్‌ (257) జిల్లా అధ్యక్షులు యస్‌.భాస్కర్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ట్రెజరర్‌ రాజశేఖర్‌, బిటిఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌.ఆర్‌.కొండయ్య పాల్గొన్నారు.