Sep 26,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు మారిపోయిన రాజా

నిరసన జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 29వ తేదీన జరిగే వంటావార్పు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు మారిపోయిన రాజా పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపురం గ్రామంలో ఆటో కార్మికుల ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మరో కోనసీమగా ప్రసిద్ధికి ఎక్కిన ఇందుకూరుపేట మండలం నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. అనేకమార్లు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని వాపోయారు.
ముదివర్తిపాలెం కాజ్‌వే నిర్మాణం రాజకీయ పార్టీల ఎన్నికల హామీలకు పరిమితవుతుందే తప్ప కార్యరూపం దాల్చలేదన్నారు. ఇలాగే కొనసాగితే తాగునీరు కొనుక్కుని తాగే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. మండలంలోని అనేక సమస్యల పరిష్కారానికి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 29న వంటావార్పు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాసిన పరశురామయ్య, మైపాడు ఆటో యూనియన్‌ కార్యదర్శి బర్రీ ప్రసాద్‌,కమిటీ సభ్యులు ఎస్‌కె.నజీర్‌, అశోక్‌, శ్యామ్‌, పురుషోత్తం, బాబు తదితరులు పాల్గొన్నారు.