Oct 26,2023 21:23

సమావేశంలో మాట్లాడుతున్న కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఎట్టి పరిస్థితుల్లోను నిర్ణీత సమయానికి సిరిమాను రధాన్ని సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి సూచించారు. గురువారం పైడితల్లమ్మ కళ్యాణమండపంలో పైడిమాంబ సేవా సంఘం, వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు. గత సంవత్సరం సిరిమాను ఊరేగింపు ఆలస్యం కావడానికి గల కారణాలపై సమీక్షించారు. సిరిమాను శీల బిగింపు, కట్లు కట్టడం, ఇరుసుమానుకు సిరిమానును అమర్చడం వంటివి నిర్మాణపు ప్రక్రియలు నిర్ణీత సమయాన్ని కల్లా పూర్తి చేసే విధంగా చూడాలని హుకుంపేటలోని జాతర ప్రక్రియలో భాగస్వామ్యం అయిన వారికి సూచించారు. సిరిమాను తయారు చేసే వడ్రంగి ప్రతినిధులతో చర్చించారు. సిరిమానుతో పాటు రధాలు తిరిగే సమయంలో ఇతరులను అనుమతించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. అందరి సహకారంతో పైడితల్లమ్మ సిరిమాను జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనాలు జరిగే విధంగా చూస్తున్నామన్నారు. సమావేశంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆర్‌జెసి యం.వి.సురేష్‌ బాబు, ఆర్‌డిఒ సూర్యకళ, దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధారాణి, డిఎస్‌పిలు గోవిందరావు, విశ్వనాథ్‌, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు.