ప్రజాశక్తి - రంపచోడవరం. : జిల్లాలోని భూ హక్కు భూ రక్ష పథకం ద్వారా నిర్ణీత గడువు లోగా భూముల రీ సర్వే పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరేతో కలిసి అన్ని మండలాలకు సంబంధించిన సర్వే అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఒలతో రీసెర్వేపై జెసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి శివ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వే ప్రారంభించిన రోజు నుండి 100 రోజులలో ప్రభుత్వ నిబంధన ప్రకారం రీ సర్వే పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 100 గ్రామాలలో పూర్తిస్థాయి రీ సర్వే చేయడం జరిగిందని తెలిపారు. డివిజన్లోని అన్ని మండలాలలో ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో రీసర్వే ప్రారంభించారో, దాని పురోగతి ఏమిటో మండలాల వారీగా సమీక్ష చేశారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి రీ సర్వే ప్రగతిపై చర్చించుకోవాలని సూచించారు. సర్వే సందర్భంగా రైతుల పేర్లు తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే బాధ్యత సంబంధిత తహశీల్దార్లపై ఉందని చెప్పారు. ఈ సర్వేకు సంబంధించిన ఫారంలో 34 రకాల విధివిధానాలు ఉన్నాయని, వాటిని క్షుణ్నంగా పరిశీలించి ఫారం నింపాలని సూచించారు. రికార్డుల ప్రకారం రైతుల పేర్లు తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఉమ్మడి భూములు ఉంటే ముటేషన్ కూడా చేయాలని సూచించారు. సర్వేకి ముందు రైతులకు నోటీసులు ఇవ్వాలని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే మళ్లీ సర్వే చేయవచ్చని చెప్పారు. ఆయా గ్రామాల్లోని గ్రామ పెద్దలకు తమ గ్రామంలోని భూములకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని, ఆయా గ్రామాల పెద్దలతో కూడా రీ సర్వేపై సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆరు రకాలైన అంశాలతో పర్సనల్ రిజిస్టర్ మీటింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే కె.దేవేంద్రుడు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రాజశేఖర్, తహశీల్దార్లు తాతారావు, శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.










