- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: గృహ నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ అధికారులను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాల్టీ హౌసింగ్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గాజుల కొల్లివలసలో లబ్ధిదారులకు సుమారు 1734 ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని, ఆ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని ప్రశ్నించారు. పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో వేసిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని, గ్రామాలనే నిర్మిస్తోందన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. సిమెంట్, ఐరన్ తదితర సామగ్రిని ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అందులో 15 లక్షల ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్.గణపతి, డిఇ అప్పారావు, ఎఇలు లకీëనారాయణ, సన్యాసిరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










