Jul 21,2023 22:30

మండల విద్యుత్‌ శాఖ ఎఇ రవికుమార్‌
ప్రజాశక్తి - ముదినేపల్లి

              వర్షాకాలంలో ముందస్తుగానే విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు, చెట్ల కొమ్మలను తొలగించే చర్యలు చేపట్టడంతో విద్యుత్‌ అంతరాయలు తగ్గుతాయని మండల విద్యుత్‌ శాఖ ఎఇ పి.రవికుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 22వేల విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయన్నారు. వాటిలో 1500 ఆక్వా సర్వీసులు కాగా, వేయి దుకాణాల సర్వీసులు, మండల వ్యాప్తంగా 125 వీధిలైట్లు, గ్రామ పంచాయతీల వాటర్‌ వర్క్సుకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ప్రజలకు, రైతులకు విద్యుత్‌ సేవలు అందించేందుకు ముదినేపల్లి, కొత్తపల్లి, పెదపాలపర్రు, చిగురుకోట, సింగరాయపాలెం గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయన్నారు. ఈఐదు సబ్‌స్టేషన్ల పరిధిలోని ఆక్వా రైతులకు, గ్రామాల్లోని విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అంది స్తున్నామన్నారు. ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్న 1300 మంది ఆక్వా రైతులు ఆక్వా విద్యుత్‌ సబ్సీడిని పొందు తున్నారన్నారు. మం డల వ్యాప్తంగా 19 ఫీడర్లు ద్వారా విద్యుత్‌ను అంది స్తున్నామన్నారు. లో ఓల్టేజీ ప్రాంతాల్లో 18 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో రూ.4కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు పంచాయతీల నుంచి జమ కావాల్సి ఉందన్నారు. విద్యుత్‌ సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్‌ స్తంభాలను పట్టుకోవడం, చుట్టు నిలబడడం చేయరాదన్నారు. తెగి నేలపై పడిన విద్యుత్‌ తీగలను పట్టుకోరాదన్నారు. ఆక్వారైతులు చెరువుల గట్లపై, నేల మీద విద్యుత్‌ వైర్లు వేయరాదన్నారు. వైర్లను చెరువు గట్టుపై నాలుగు అడుగుల ఎత్తులో స్తంభాలకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో గాలులకు ఎక్కడైన తీగలు తెగిపడితే వాటిని పట్టుకోకుండా వెంటనే 9440812171 ద్వారా తమ కార్యాలయానికి సమాచారం అందిస్తే తమ సిబ్బంది వచ్చి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఎఇ పి.రవికుమార్‌ తెలిపారు.