కెవిపిఎస్ జిల్లా ఐదో మహాసభలో వక్తలు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
దళిత సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే శరణ్యమని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం కెవిపిఎస్ జిల్లా ఐదో మహాసభ స్థానిక ప్రియదర్శిని కళాశాల ఆవరణలో జరిగింది. ఈ మహాసభకు కెవిపిఎస్ నేత వంగవ సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది బాపూజీ మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యంతో పనిచేస్తేనే దళితుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దళితులు తీవ్ర వివక్షకు గురికావడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్రలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు లబ్ధి చేకూర్చే 27 పథకాలను రద్దు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై దళితులంతా ఐక్యంగా పోరాడాల్సింది పోయి రిజర్వేషన్ల వాటాలపై కుమ్ములాడుకోవడం శోచనీయమన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కెవిపిఎస్ గడచిన మూడేళ్ల కాలంలో దళిత సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమాల నివేదికన సభలో ప్రవేశపెట్టారు. జిల్లాలో దళితుల భూములకు రక్షణ కల్పించాలని కులవివక్ష నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో అన్ని దళిత సంఘాలను ఐక్యం చేసి జిల్లావ్యాప్తంగా దళిత సమస్యలపై ఉమ్మడి పోరాటాల నిర్వహించనున్నా మన్నారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అర్.లింగరాజు, మర్రి వెంకటేశ్వరరావు, న్యాయవాది జువాల బాపూజీ, బొబ్బర ఎలీషా, ఆడమల్లి సోమరాజు, ముప్పిడి మరియమ్మ, మహేశ్వరి పాల్గొన్నారు.










