ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో నిరంతరం పైపులైన్‌లు పగిలిపోవటం, లీకేజీలు సంభవిం చటంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. గత మూడు రోజుల క్రితం, పాత ఆంధ్రా బ్యాంక్ సమీపంలో మూడు రోజుల పాటు మరమ్మతుల కోసం గుంటలు తవ్వటంతో ప్రజల రాకపోకలకు మరియు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. నిన్న, మొన్న సంఘటనలే కాకుండా అనునిత్యం లీకేజీ మరమతులతో అటు అధికారులు, ఇటు గ్రామ ప్రజలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం గతంలో కోటి ఇరవై మూడు లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకంలో నెలకొన్న అవినీతికి దర్పణం ఈ లీకేజీలు. ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం పైపులు వేయటంతోనే నేడు నిరంతర లీకేజీలు నెలకొంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీలలో కూడా నీటి వసతి సరిగా లేదని ఆయా గ్రామాల లబ్ధిదారులు వాపోతున్నారు.
కనిపించని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
నిరంతరం మండలంలో అందుబాటులో ఉండి ఏ గ్రామంలో నీటి సమస్య ఉంది అనేది తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శివకృష్ణ వారాల తరబడి మండలానికి రాకపో వటంతో ఎక్కడి సమస్య అక్కడ ఉండిపోతోం దనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఏఈ మాత్రం వారానికొకసారి కూడా ఆఫీసుకు రావటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎంపిడిఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే సంబంధిత ఏఇ స్పందించాల్సి ఉంటుందని, అతని పని తీరును విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు.










