May 20,2021 06:58

   యు.టి.ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కొలనుకొండ నాగమల్లేశ్వరరావు 52 సంవత్సరాల వయస్సులోనే కరోనా కాటుకు బలికావడం ఊహించని పరిణామం. గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణం లోను, ప్రజాతంత్ర ఉద్యమం లోను కీలక పాత్ర పోషించారాయన. గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెం మండలం చందోలు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి కష్టపడి విద్యనభ్యసించి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. 1996లో బెల్లంకొండ మండలంలో ఉద్యోగంలో చేరారు. అనంతరం చెరుకుపల్లి మండలంలో దీర్ఘకాలం పని చేశారు. అప్పటి నుండే ఆయన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైనది. ఇటీవల యు.టి.ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 6 సంవత్సరాల నుండి జిల్లా కేంద్రంలో యు.టి.ఎఫ్‌ జిల్లా కార్యాలయం లోనే నివాసముంటూ మేడికొండూరు మండలం శిరిపురంలో పని చేస్తూ కరోనా కాటుకు బలయ్యారు. నేను యు.టి.ఎఫ్‌ కార్యాలయంలోనే దీర్ఘకాలంగా నివాసముండటంతో నాగమల్లేశ్వరావు తో సాన్నిహిత్యం ఏర్పడినది. ఆయన దినచర్యను పరిశీలిస్తే క్రమశిక్షణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. ఉదయం 5 గంటలకు లేవడం...జిల్లా కేంద్రం ఉపాధ్యాయ రంగంలో వస్తున్న సమస్యలపై అర్జీలు తయారు చేయడం, ఉపాధ్యాయుల వ్యక్తిగత సమస్యలపై పిటిషన్లు తయారు చేయడం, ఫైలింగ్‌ చేయడం, అకౌంట్‌ నిర్వహణ పనులతో పాటు, మార్క్సిస్టు పత్రికకు అనువాదాలు పంపడం చేసేవారు.
   నాగమల్లేశ్వరరావు మంచి అధ్యయనశీలి. వృత్తిపరమైన పుస్తకాలే కాక, మార్క్సిస్టు సాహిత్యాన్ని, ఆర్థిక, రాజకీయ పరిణామాలను, అంతర్జాతీయ అంశాలను అధ్యయనం చేసేవారు. నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం...జిల్లాలో అనేక చోట్లకు వెళ్ళి క్యాడర్‌కు, కార్యకర్తలకు స్టడీ సర్కిళ్లు, రాజకీయ శిక్షణకు వివిధ అంశాలపై క్లాసులు నిర్వహించడం... బోధించడం... ఆయన ప్రత్యేకత. నిరంతరం కష్టపడే నైజం వారిది. ఉపాధ్యాయ రంగంలో పార్టీ నిర్మాణానికి ప్రత్యేకమైన కృషి ప్రారంభించారు. నిర్మాణ రాహిత్య ధోరణుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించేవారు. అనేక సందర్భాలలో ప్రజాతంత్ర ఉద్యమానికి ఆర్థిక సహకారం కోసం అప్పీల్‌ చేసినప్పుడు తాను స్పందించడమే గాక, ఉపాధ్యాయులకు కూడా అప్పీల్‌ చేసి కష్టకాలంలో ఆర్థిక సహకారం అందించడంలో కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో పేదలకు వస్తు రూపేణా సహకరించేందుకు సుమారు జిల్లాలో రూ. 60 లక్షలు వసూలు చేసి ప్రజలకు సహకరించారు. గుంటూరులో మే 5వ తేదీన కరోనా ఐసొలేషన్‌ కేంద్రానికి ఉపాధ్యాయుల నుండి విరాళాలు సేకరించి సహకరించే ప్రయత్నంలోనే ఆయన అమరులు కావడం జీర్ణించుకోలేని పరిస్థితి. చిన్న వయస్సులోనే కామ్రేడ్‌ నాగమల్లేశ్వరరావు మరణించడం కుటుంబానికి తీరని వ్యధను మిగిల్చింది. ఆ కామ్రేడ్‌ ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.


- పాశం రామారావు,
సిపియం తూర్పు జిల్లా కార్యదర్శి.