Mar 25,2023 21:51

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
           సిఎం జగన్‌ దెందులూరు పర్యటనలో భాగంగా ప్రోటోకాల్‌లో ప్రజాప్రతినిధిగా ఆహ్వానం పలికి ముందస్తు ఆరెస్టు చేయడం, నిరంకుశ పాలనకు నిదర్శనమని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభలో ప్రోటోకాల్‌ ప్రకారం 58 మందికి ఆహ్వానం పలికారని, ఆహ్వాన కమిటీ తనపేరును 19వ వరుస నెంబరులో ముద్రించారన్నారు. సభకు హాజరవ్వాలనుకుంటున్న దశలో ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. సభకు ముందు తాము ఆందోళనలకు ఎలాంటి పిలుపునివ్వలేదని, ఉద్యమానికి ఏర్పాట్లు చేయలేదన్నారు. అయినా ముందస్తు అరెస్టులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు వినతిపత్రాలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారని విమర్శించారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముందస్తు అరెస్టులు చేసి కాలం వెళ్లదీయాలని చూడటం ముఖ్యమంత్రి అవివేకానికి నిదర్శనమన్నారు. గౌరవించాల్సిన చోట అవమానించడం ప్రస్తుత ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సిపిఎస్‌ రద్దు చేసి పాత పింఛను అమలు చేస్తామన్న హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పిఆర్‌సి బకాయిలు రూ.ఐదు వేల కోట్లు విడుదల చేయాలని, డిఎ బకాయిలు రూ.నాలుగు వేల కోట్లు ఇవ్వాలని, సర్వ శిక్షా అభియాన్‌లో 14 విభాగాల్లో పనిచేస్తున్న 25 వేల మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలోని 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 30 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలన్నారు. కోవిడ్‌లో మృతిచెందిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జిఒ1ని రద్దు చేయాలని, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ఏలూరు:సిఎం జగన్‌ దెందులూరు పర్యటన సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో ఆయన్ను నిర్బంధించారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహను అరెస్టు చేసి నూజివీడు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులను చింతలపూడి, కొయ్యలగూడెం మండలాల్లో హౌస్‌ అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారు. సిఎం పర్యటన సందర్భంగా అక్రమ అరెస్టులు పట్ల రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
నూజివీడు రూరల్‌ : సిఎం జగన్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహను గొల్లపల్లిలోని ఆయన నివాసం వద్ద నూజివీడు రూరల్‌ పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు ఇచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.