Nov 12,2021 06:59

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో అప్రజాస్వామికమైనవి, అనాలోచితమైనవి చాలా ఉన్నాయి. వ్యవసాయంలో విద్యుత్‌ మీటర్లు, ఆస్తి పన్ను ప్రాతిపదికను మార్చడం, చెత్త పన్ను విధించడం, విద్యా విధానంలో ఏకపక్ష, ప్రజా వ్యతిరేక మార్పులు ప్రవేశపెట్టడం, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం, మూడు రాజధానుల ప్రతిపాదన వంటివి ప్రజా వ్యతిరేకమైనవి. స్థానిక ఎన్నికలలో వ్యక్తమైన అధికార దుర్వినియోగం, ఏకపక్షంగా ఎన్నికలను బలవంతంగా జరిపించుకోవడం, కక్షపూరితంగా కేసులు బనాయించడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కావు. ఈ విధానాలపై పోరు సాగాల్సిందే. ఐతే ఆ పోరాటం ప్రజా ఉద్యమంగా సాగాలే తప్ప నిరంకుశ స్వభావం కల రాష్ట్రపతి పాలనను కోరడం ద్వారా కాదు. అప్రజాస్వామిక పాలనకు విరుగుడు కావాలంటూనే, అందుకోసం మరింత నిరంకుశమైన రాష్ట్రపతి పాలన కోరడంలో ఔచిత్యం ఏముంది ?

    రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతున్నాయని, ప్రభుత్వం వత్తాసు తోటే ఉగ్రవాదం చెలరేగుతోందని, దళిత, బలహీన వర్గాలమీద దురాగతాలు సాగుతున్నాయని ఆరోపిస్తూ అందుకు విరుగుడుగా రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఇటీవల రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ ను కలిసి డిమాండ్‌ చేసింది.
    ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షాలతో, ప్రజా సంఘాలతో సంప్రదించి వాటి అభిప్రాయాలను స్వీకరించే ధోరణి లేనప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ ను జోక్యం చేసుకోమని కోరడం పరిపాటి. పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నప్పుడు రాష్ట్రపతిని కూడా పరిస్థితిని చక్కదిద్దమని కోరవచ్చు. ఐతే ఇక్కడ టిడిపి ఏకంగా రాష్ట్రపతి పాలననే కోరుతోంది.
     ఒక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటే గవర్నర్‌ నివేదిక ఆధారంగా కేంద్ర క్యాబినెట్‌ సిఫార్సు చేయాలి. అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే 356 అధికరణాన్ని ప్రయోగించాలని సుప్రీంకోర్టు పలు తీర్పులనిచ్చింది.
భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉంది. ఆయా రాష్ట్రాల ప్రజలకు తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ఉంది. అలా ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. అందుకే సిపిఎం మొదటి నుంచీ 356 అధికరణాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికీ ఆ డిమాండ్‌ కి కట్టుబడి వుంది.
    మరి రాష్ట్రంలోని ప్రభుత్వం అప్రజాస్వామికంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తూవున్నప్పుడు ఏం చేయాలి? ప్రజాస్వామ్య వ్యవస్థ సాంప్రదాయాలకు పాలకుల నుండే ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లుతుంది తప్ప ఇతరుల నుండి కాదు. అందుకే అటువంటి సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రజలను చైతన్యపరచి, ఉద్యమాలు నడపాలి. ప్రజాబలమే ఎప్పుడైనా నిరంకుశత్వానికి ముక్కుతాడు వేయగలదు. నిరంకుశ పోకడలు పోయే ప్రభుత్వం అధికారంలో ఉంటే అది ఎటువంటి ప్రజా ఉద్యమాలను గాని, నిరసనలను గాని సహించదు. అధికార బలంతో అణచివేయడానికే పూనుకుంటుంది. కాని ప్రజలలో తగిన మోతాదులో చైతన్యం వ్యక్తం అయినప్పుడు అధికార బలం గాని, పోలీసుల దమనకాండ గాని ప్రజా ఉద్యమాల ముందు తల దించాల్సిందే.
     మన దేశ ప్రజల చైతన్యం జాతీయోద్యమంలో వెల్లివిరిసింది. బ్రిటిష్‌ వలసపాలకుల దమనకాండను ఎదిరించి స్వాతంత్య్రాన్ని సాధించింది. ఎమర్జెన్సీ చీకటిరోజుల నిరంకుశత్వాన్ని తుదముట్టించిందీ ఆ చైతన్యమే. ఇక రాష్ట్రంలో తెలుగు ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది 1984లో ఎన్‌టిఆర్‌ ప్రభుత్వ బర్తరఫ్‌కి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. ఆ ఉద్యమం ఒత్తిడికి తలొగ్గి కేంద్రం తిరిగి ఎన్‌టిఆర్‌ ను ముఖ్యమంత్రిగా నియమించి, గవర్నర్‌ ను మార్చివలసి వచ్చింది.
    ఇక తాజా ఉదాహరణ దేశ రాజధానిలో నిరాఘాటంగా సాగుతున్న రైతన్నల పోరాటం. సుప్రీం కోర్టు కూడా ఆ పోరాటాన్ని గుర్తించి గౌరవించింది. కేంద్ర బలగాలు ఆ ఉద్యమాన్ని నిరోధించరాదని ఆదేశించింది.
    ప్రజాస్వామ్య వ్యవస్థను, దాని విలువలను కాపాడుకోవలసినది ప్రజలే. దానికి బదులు కేంద్ర అధికారాన్ని వినియోగించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా టిడిపి కోరుతోంది. 1984లో ఎన్‌.టి. రామారావు నాయకత్వంలో 356 అధికరణాన్ని రద్దు చేయాల్సిందేనని పోరాడిన తెలుగుదేశానికి, ఇప్పుడు ఆ 356 అధికరణమే శరణ్యం అంటున్న చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశానికి ఇంత తేడా ఎందుకొచ్చింది?
1998 నుండి నేటి దాకా ఆ పార్టీ అనుసరించిన నయా ఉదారవాద సిద్ధాంతం, దానికి అనుగుణంగా చేసిన ప్రపంచబ్యాంకు భజన ఇందుకు కారణం. 2000లో జరిగిన విద్యుత్‌ పోరాటం టిడిపిలో వచ్చిన మార్పుకు అద్దం పడుతుంది. తాజాగా రాష్ట్ర విభజన అనంతర కాలంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ పోకడలతోనే వ్యవహరించింది తప్ప ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించింది లేదు.
ప్రజా ఉద్యమాలపై లెక్కలేనన్ని కేసులను బనాయించడం, ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను కూడా గౌరవించకుండా ప్రదర్శనలకు, సభలకు అనుమతులను నిరాకరించడం, ముందస్తు అరెస్టులకు పాల్పడడం- ఇవన్నీ ఈ రోజు జగన్‌ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినవి కావు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో మొదలైనవే. మోతాదులోనో, లేక కక్ష సాధింపు ధోరణిలోనో కొన్ని హెచ్చుతగ్గులుండొచ్చు. అంతే.
    ప్రజలకు రాజకీయాలు వుండకూడదని, విద్యార్థులకు, కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు సంఘాలు వుండకూడదని, ప్రజా సంఘాలు అప్రజాస్వామికమైనవని అత్యంత అన్యాయమైన భాష్యాలను చెప్పి ప్రజలను అపొలిటికల్‌గా (రాజకీయ రహితంగా) మార్చడానికి పూనుకున్నదీ చంద్రబాబే. ఇంతకాలమూ ప్రజలలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చప్పబరిచాక, ప్రజాఉద్యమాలను తూలనాడాక, ఆ ఉద్యమాలను నిర్బంధాలకు గురిచేశాక, ఈరోజు అదే ప్రజలను మళ్ళీ ఉద్యమాల వైపు కదిలించడానికి టిడిపి అధినేతకు బహుశా మనస్కరించడం లేదేమో. అందుకే ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలను కాకుండా రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఆ చర్యను సమర్ధించుకోడానికి ఇప్పుడు నానా తంటాలూ పడుతున్నారు.
     తెలుగుదేశం వైఖరి చిన్నయసూరి నీతిచంద్రిక లోని కథను గుర్తుకు తెస్తోంది. ఒక చెట్టుపైన గూడు కట్టుకున్న పక్షి పెట్టిన గుడ్లను ఆ చెట్టు కింది పుట్ట లోని పాము ప్రతీ సారీ స్వాహా చేసేస్తోంది. ఆ పాము పని పట్టాలనుకున్న పక్షి అందుకోసం ముంగిసను రంగం లోకి దించాలనుకుంది. కొన్ని ఎండు చేపల్ని తీసుకువచ్చి ఆ చెట్టు పరిసరాల్లో సంచరించే ముంగిసను ఆకర్షించేలా, పాము పుట్ట వైపుకు ఆ ముంగిస వచ్చేలా వేసింది. పక్షి వ్యూహం ఫలించి ఆ ముంగిస ఒక్కో ఎండు చేపనూ తింటూ పాము ఉన్న పుట్ట వద్దకు వచ్చింది. అక్కడ ఆ పామును కొరికి చంపింది. ఐతే అక్కడితో ఆగకుండా ఆ చెట్టు మీదకు ఎగబాకి చెట్టుమీద పక్షి గూడులో ఉన్న గుడ్లను కూడా స్వాహా చేసింది.
     ఇప్పుడు చంద్రబాబు జగన్‌ ప్రభుత్వం పని పట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం చరిత్ర ఏమిటి? రాజ్యాంగాన్ని, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉండే కనీస బాధ్యతను కూడా విస్మరించి వ్యవహరించే చరిత్ర అది. ప్రజల ప్రాణాలను కాపాడే కనీస బాధ్యతను కూడా నిర్వహించకుండా, ఆ ప్రజలనే వేల సంఖ్యలో గుజరాత్‌ లో మత మారణహోమానికి బలి చేసిన చరిత్ర. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కాని ఆ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తినే కాలరాసి, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయికి దిగజార్చిన చరిత్ర. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, వాటి పరిధిలోకి వచ్చే వ్యవసాయం, విద్య, విద్యుత్తు తదితర అంశాలను కూడా తన గుప్పెట్లో చిక్కించుకుని రాష్ట్రాలను నామమాత్రంగా దిగజార్చాలని చూస్తున్న ప్రభుత్వం అది.
     ప్రత్యేకించి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో మొదలుబెట్టి, అన్ని విషయాలలోనూ తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది. విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌ వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం పునరావాసం తదితర అంశాలన్నింటా బిజెపి ప్రభుత్వం మనకు తీరని అన్యాయమే చేస్తోంది. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిన చందాన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నడుమ ఉన్న నదీజలాల సమస్యలో జోక్యం చేసుకుని మొత్తం నదీజలాల మీద, వాటిపై నిర్మించిన విద్యుత్‌ ప్రాజెక్టుల మీద పెత్తనం తానే చేజిక్కించుకుంది. ఏదో ఒక విధంగా మన రాష్ట్రం లోనూ అధికారానికి రావాలన్నదే ఆ బిజెపి యావ అంతా. ఈ వాస్తవాలన్నింటినీ విస్మరించి ఆ ప్రభుత్వాన్నే జోక్యం చేసుకోమని కోరడం వెనుక వివేచన కానరావడంలేదు.
    రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో అప్రజాస్వామికమైనవి, అనాలోచితమైనవి చాలా ఉన్నాయి. వ్యవసాయంలో విద్యుత్‌ మీటర్లు, ఆస్తి పన్ను ప్రాతిపదికను మార్చడం, చెత్త పన్ను విధించడం, విద్యా విధానంలో ఏకపక్ష, ప్రజా వ్యతిరేక మార్పులు ప్రవేశపెట్టడం, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం, మూడు రాజధానుల ప్రతిపాదన వంటివి ప్రజా వ్యతిరేకమైనవి. స్థానిక ఎన్నికలలో వ్యక్తమైన అధికార దుర్వినియోగం, ఏకపక్షంగా ఎన్నికలను బలవంతంగా జరిపించుకోవడం, కక్షపూరితంగా కేసులు బనాయించడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కావు. ఈ విధానాలపై పోరు సాగాల్సిందే. ఐతే ఆ పోరాటం ప్రజా ఉద్యమంగా సాగాలే తప్ప నిరంకుశ స్వభావం కల రాష్ట్రపతి పాలనను కోరడం ద్వారా కాదు. అప్రజాస్వామిక పాలనకు విరుగుడు కావాలంటూనే, అందుకోసం మరింత నిరంకుశమైన రాష్ట్రపతి పాలన కోరడంలో ఔచిత్యం ఏముంది ?
     బెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సిపిఎం పై అత్యంత హేయమైన దాడులకు, నిర్బంధానికి తెగబడుతోంది. వందలాదిగా సిపిఎం కార్యాలయాలను తృణమూల్‌ గూండాలు స్వాధీనం చేసుకున్నారు. 20,000 మందికి పైగా కార్యకర్తలు తమ ఇళ్ళను వదిలి వేరే చోట్ల తలదాచుకుంటున్నారు. దాదాపు 700 మంది సిపిఎం కార్యకర్తలు, నాయకులు తృణమూల్‌ గూండాల దాడులకు ఈ కాలంలో బలైపోయారు. గతంలో 1972-77 మధ్య కాలంలో కూడా అప్పటి కాంగ్రెస్‌ హయాంలో సిపిఎం తీవ్రమైన అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొన్నది. 1400 మంది కార్యకర్తలను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. ఆ నిర్బంధాలను తట్టుకుని, ప్రజలను సమీకరించి ఉద్యమించి తిరిగి ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పింది సిపిఎం. అంతే కాని రాష్ట్రపతి పాలనను డిమాండ్‌ చేయలేదు. ఇప్పుడు కూడా తృణమూల్‌ దురాగతాలపై పోరులో ప్రజలను సమాయత్తం చేస్తూ ముందుకు సాగుతోంది.
    త్రిపుర రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం సిపిఎం పై చేయని దురాగతం లేదు. ఆఫీసులను తగులబెట్టడం, కార్యకర్తలను హత్య చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, అబద్ధపు ప్రచారాలు చేయడం అక్కడ నిత్యకృత్యంగా సాగుతోంది. ఆ ప్రభుత్వం వంద మందికి పైగా పాత్రికేయులపై దేశద్రోహం కేసు బనాయించిన వైనం ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిట వుంది. అక్కడ కూడా సిపిఎం పట్టు వదలకుండా ప్రజలను సమీకరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పోరాడుతోందే తప్ప రాష్ట్రపతి పాలనను పరిష్కారంగా భావించడం లేదు. అధికారంలో ఉన్న కేరళ లో రాష్ట్రం ఎదుర్కుంటున్న అన్ని ప్రధాన సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు జరిపి, ప్రతిపక్షాల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించే వైఖరిని పినరయి విజయన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రజలపై విశ్వాసం, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న సిపిఎం వ్యవహరించే తీరు అది.
     కార్పొరేట్లే అభివృద్ధి చేసేస్తాయని, ప్రపంచబ్యాంకే మార్గదర్శి అని, వాటిని సంతృప్తి పరచడమే పురోగతికి మార్గం అని భావించి, ఆ ధోరణిని ప్రశ్నించేవారిని ప్రగతి నిరోధకులుగా పరిగణించే వైఖరిని అనుసరిస్తూ వచ్చిన టిడిపి...ఈ రోజు ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడైనా ప్రజలను, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం, పాటించడం అలవరచుకోవాలి. 'చరిత్ర నిర్మాతలు ప్రజలే తప్ప నాయకులు కాదు' అన్న సత్యాన్ని జీర్ణించుకోవాలి.

ఎం.వి.ఎస్‌. శర్మ

ఎం.వి.ఎస్‌. శర్మ