May 18,2021 07:34

   దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వాన్ని పాదుకొల్పడంలో మోడీ ప్రభుత్వానిది అందెవేసిన చెయ్యి అని ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నా తన వైఖరిని మరింత పటిష్టపర్చుకునే దిశలోనే సర్కారు ప్రయాణిస్తోంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని నిరసిస్తూ ఢిల్లీలో వెలసిన వాల్‌పోస్టర్లపై మోడీ ప్రభుత్వం కన్నెర్ర చేయడమే కాకుండా ఏకంగా నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో 17 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసి పాతిక మంది అనుమానితులను శనివారం అరెస్టులు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. సూత్రధారుల అంతు తేలుస్తామని కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ ఉన్నతాధికారులు హెచ్చరించారు. సిసిటివి ఫుటేజిలను ఉపయోగించి కేసులు బనాయించేందుకు హైరానా పడుతున్నారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండవసారి వచ్చాక నయా-ఉదారవాద విధానాలను, హిందూత్వ సిద్ధాంతాలను రెండింటినీ మేళవించి అమలు చేసే క్రమంలో విమర్శను తట్టుకోలేక నిరంకుశత్వానికి పదును పెట్టింది. సోషల్‌ మీడియాలో, ఇతరత్రా ప్రభుత్వ విధానాల్లో తప్పులను ఎత్తిచూపే, నిరసన వ్యక్తపర్చే వారంటే కంపరానికి లోనవుతోంది. రాజద్రోహం సహా కఠినాతి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయిస్తోంది. అక్కడితో ఆగకుండా ఇ.డి, సిబిఐ, ఎన్‌ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వ వ్యతిరేక, వాస్తవిక కథనాలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలపై ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడటం నిత్యకృత్యమైంది.
   ఢిల్లీలో వాల్‌పోస్టర్లలో ప్రభుత్వాన్ని, ప్రధానిని కించపర్చే వ్యాఖ్యలేమీ లేవు. ఉన్నదల్లా ప్రభుత్వ విధానంలోని లోపభూయిష్టతే. 'ప్రధాన మంత్రీ, మన బిడ్డల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?' అనే ప్రశ్న బిజెపి ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఆ ఫలితమే కేసులు, అరెస్టులు. కోవిడ్‌ వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ ఉధృతికి దేశం అల్లకల్లోలంగా తయారైంది. ప్రతి రోజూ నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. మూడున్నర లక్షలకు అటు ఇటుగా పాజిటివ్‌ కేసులొస్తున్నాయి. వైరస్‌ దాడికి జనం భీతిల్లుతుండగా కరోనా కట్టడిపై మోడీ సర్కారు నీరో చక్రవర్తికి మల్లే వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో ఉపాధి కోల్పోయిన పేదలకు అత్యవసర సహాయం చేయమంటే చేతులు కట్టుక్కూర్చుంది. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ప్రాణాధార మందుల కొరత కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌ విధానం అస్తవ్యస్తం, వ్యాపారమయం. రాష్ట్రాలకు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపుతోంది. అందరికీ ఉచితంగా టీకా, కరోనా కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం, ఆక్సిజన్‌ సరఫరా, రాష్ట్రాలకు నిధులు, అఖిలపక్ష సమావేశం, తదితర డిమాండ్లతో కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎన్‌డిఎ యేతర ప్రాంతీయ పార్టీలు సంయుక్తంగా లేఖ రాసినా మోడీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇంత బాధ్యతారహితంగా ఉన్న ప్రభుత్వాన్ని, పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే, విమర్శిస్తే, నిరసిస్తే మాత్రం ఓర్వలేక అక్రమ కేసులకు కాలుదువ్వడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడవడమే.
   ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తమ నాయకుడు మోడీ విమర్శకులపై కేసులు పెడుతుండగా బిజెపి ఏలుబడి లోని రాష్ట్రాలు అంతకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాతంత్ర హక్కుల హననానికి సై అంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు, ఆస్పత్రిలో బెడ్‌, ఆక్సిజన్‌ కోసం సోషల్‌ మీడియా ద్వారా ప్రాధేయపడ్డందుకు కేసులు పెట్టడం బిజెపి నిరంకుశ ధోరణికి పరాకాష్ట. గుజరాత్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌ తదితర బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలెన్నో. మోడీ వచ్చాక ప్రజాస్వామ్యం అమలులో భారత్‌ దిగజారిందని స్వీడన్‌కు చెందిన 'వి-డెన్‌' సంస్థ మొన్న మార్చిలో వెల్లడించింది. మన రాష్ట్రంలోనూ ఇదే ధోరణి పొడచూపుతున్నదని రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఉదంతం బట్టి భావించాలి. ఒక వైపు కేంద్ర నిరంకుశత్వం, రాష్ట్రాల పట్ల వివక్షత పెరుగుతున్న నేపథ్యంలో అందరి మద్దతూ కూడగట్టి ప్రజాస్వామ్య హక్కుల కోసం, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడంలో ప్రాంతీయ పార్టీలు ముందుండాలి. అలాగాక కేంద్ర నిరంకుశత్వాన్ని అనుకరిస్తే ఆ ప్రాంతీయ పార్టీలకూ ముప్పు తప్పదు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య చైతన్యం బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను పరిస్థితులు సూచిస్తున్నాయి.