Feb 10,2021 07:06

   కమ్యూనిస్ట్‌ ఉద్యమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ 'ఫ్రంట్‌లైన్‌' పత్రిక ప్రత్యేక ముఖాముఖిలో ... భారత దేశంలో సామాజిక మార్పు కోసం కమ్యూనిస్టులు పోషించిన పాత్ర, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, గుణపాఠాలు, పార్లమెంటరీ అనుభవాలు, కమ్యూనిస్టుల ముందున్న సమకాలీన సవాళ్ళ గురించి చెప్పారు. వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు...
   దేశంలో అత్యంత బలమైన కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, భారతదేశంలో సామాజిక, రాజకీయ మార్పు కోసం కమ్యూనిస్టు ఉద్యమం చేసిన సేవలను మీరు ఏ విధంగా చూస్తారు ?
   రెండు చారిత్రక సంఘటనల ఫలితమే భారత కమ్యూనిస్టు ఉద్యమం. ఒకటి, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 'సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం', రెండు, 1917లో రష్యాలో విజయవంతమైన 'అక్టోబర్‌ విప్లవ' ప్రభావం. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎఐసిసి సదస్సులో 'సంపూర్ణ స్వాతంత్య్రం' నినాదాన్ని మొదటిసారి లేవనెత్తింది కమ్యూనిస్టులే. కార్మికులకు, రైతులకు వర్గ ప్రాతిపదికన ఏర్పడిన సంఘాలకు మార్గదర్శకత్వం వహించింది, స్వాతంత్య్ర పోరాట కాలంలో 'స్వరాజ్యం' అంటే భారతదేశ ప్రజలు ఆర్థిక, సామాజిక విముక్తితో పాటు పొందే రాజకీయ స్వాతంత్య్రం అనే పూర్తి చిత్రాన్ని ఇచ్చింది కూడా భారత కమ్యూనిస్టు పార్టీనే.
   స్వాతంత్య్ర సాధన కోసం, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి, దానికి దేశీయంగా మద్దతు ఇస్తున్న యువరాజులు, జమీందార్లు, ఫ్యూడల్‌ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంటుందనే అవగాహన నుంచి ఉద్భవించిన ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటంతో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని మిళితం చేయడం కమ్యూనిస్టులు చేసిన మరొక విశేషమైన కృషి.
   తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెబాగా పోరాటం, పున్నప్ర వాయలార్‌ పోరాటం, దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో కమ్యూనిస్టులు పోషించిన నాయకత్వ పాత్రను రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉవ్వెత్తున ఎగసిన భారీ ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాలు చూశాయి. జమీందారీ వ్యవస్థ రద్దు, భూసంస్కరణలు, సీలింగ్‌ కంటే మించి ఉన్న భూమిని భూమి లేని నిరుపేదలకు పంచాలని, కౌలు రైతుల హక్కులు, ఇతర అనేక సమస్యలను కమ్యూనిస్టు పార్టీ ఒక జాతీయ వేదిక పైకి తీసుకువచ్చిన తీరును, స్వాతంత్య్రం సాధించిన తరువాత ఫ్యూడల్‌ వ్యతిరేక ఎజెండా గమనించింది.
   కమ్యూనిస్టులు ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా భూస్వామ్య వ్యవస్థ రద్దును సాధించారు, ఫ్యూడల్‌ వ్యతిరేక ఎజెండా అసంపూర్తిగా మిగిలింది. ఆ పని పూర్తి చేసేందుకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ పాలకులు తిరస్కరించారు.
1950లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో కూడా కమ్యూనిస్టులు చాలా కీలకమైన పాత్రను పోషించారు. రాష్ట్రాలను ప్రజాస్వామికంగా నిర్మించడంలో భాష ముఖ్యమైన భూమికను పోషించింది. దీనిని కమ్యూనిస్టులే సిద్ధాంతీకరణ చేసి, దానిని విశాలాంధ్ర, ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్‌ లాంటి ప్రజా ఉద్యమాల ద్వారా అమలు జరిగేటట్టు చేశారు.
   కమ్యూనిస్టులు కార్మిక, కర్షక సమస్యలను జాతీయ రాజకీయ వేదిక పైకి తీసుకొచ్చి, ఆర్థిక, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా వర్గ ప్రాతిపదికన ఉద్యమాలను నిర్మించారు. భారత దేశంలో ఉన్న పెట్టుబడిదారీ వృద్ధి క్రమానికి వామపక్ష, ప్రజాతంత్ర విధానాన్ని ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేశారు.
    అదేవిధంగా విభిన్న వర్గాల ప్రజల ప్రాథమిక హక్కుల కోసం, రాజకీయాలలో ప్రజల భాగస్వామ్యం కోసం ప్రజా ఉద్య మాలను నిర్మించడం ద్వారా కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా కృషి చేశారు. మతోన్మాద రాజకీయ వారసత్వం ఫలితంగా దేశ విభజన జరగడంతో, కమ్యూనిస్టులు ఎల్లవేళలా లౌకికతత్వానికి ఒక స్థిరమైన శక్తిగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వం, మతం రెండూ వేరు వేరుగా ఉండాలన్న లౌకిక నిబంధనకు వారు అనునిత్యం అనుకూలంగా ఉంటున్నారు, కానీ పాలకవర్గ పార్టీలు ఆ నిబం ధనను అమలు చేయడంలో వక్రీకరణలకు పాల్పడుతున్నాయి.


కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకు, భారతదేశ ప్రజాతంత్ర విప్లవం కోసం జరిగే పోరాటంలో, భూసంస్కరణలు, సమాఖ్య విధానం కోసం పోరాటం చేయడం రెండు ముఖ్యమైన అంశాలు. నేడు ప్రజాతంత్ర విప్లవం కోసం జరిగే పోరాటంలో కమ్యూనిస్టుల ముందున్న అత్యవసరమైన, ప్రధానమైన కర్తవ్యాలు ఏమిటి ?
    స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల కాలంలో ఏమి సాధించుకోవాలో అవి సాధించుకున్నాం. నేడు భూసంస్కరణలు, ఫెడరలిజం, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినంత వరకు వాటి స్వభావాన్ని వ్యతిరేక దిశలో మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు దశాబ్దాలుగా మనకు నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలు, వాటికి తోడుగా నేడు అధికారంలో ఉన్న మితవాద హిందూత్వ శక్తులు పెరుగుతూ వస్తున్నాయి.
   ప్రస్తుతం, దేశంలో కార్మికులను దోపిడీకి గురి చేస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అత్యవసరమైన, అతి ముఖ్యమైన కర్తవ్యం కమ్యూనిస్టులు, వామపక్షాల ముందుంది.
కార్మికులు, రైతుల హక్కులపై ఎటువంటి కనికరం లేకుండా హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. దోపిడీకి పాల్పడే పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ఈ తరహా దాడులు ఉద్భవిస్తున్నాయి. దీనితో పాటుగా ఈ నయా ఉదారవాద పాలనను అమలు చేస్తున్న నిరంకుశ హిందూత్వ ప్రభుత్వం మనకుంది. ఈ పాలన మనకున్న ప్రస్తుత రాజ్యాంగంలోని నియమ నిబంధనలను అమలు చేయకుండా రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నది. నిరంకుశంగా పాలిస్తున్న ప్రభుత్వం నుంచి దేశంలోని ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వ విలువలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి నయా ఉదారవాద విధానాలకు, హిందూత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ముఖ్యమైన కర్తవ్యం కమ్యూనిస్టుల ముందుంది.


స్వాతంత్య్రం సాధించిన తొలి రోజుల్లో, స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వాన్ని బూర్జువా భూస్వామ్య ప్రభుత్వంగా కమ్యూనిస్టులు గుర్తించారు. పాలకవర్గాల సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల కారణంగా భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడింది. పరిమితంగానైనా కొన్ని రాష్ట్రాల్లో భూసంస్కరణలు అమలయ్యాయి. ప్రస్తుత భారతదేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని, భారత పాలకవర్గాల స్వభావాన్ని సిపిఐ(ఎం) ఏ విధంగా చూస్తుంది ?
   భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు), తన కార్యక్రమంలో భారత ప్రభుత్వాన్ని, బడా బూర్జువా నాయకత్వంలోని బూర్జువా భూస్వామ్య కూటమిగా విశ్లేషించింది. కొన్ని దశాబ్దాల కాలం పాటు అభివృద్ధి చెందుతూ వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ, తరువాత కాలంలో పెట్టుబడి కేంద్రీకరణకు, బడా బూర్జువా వర్గం యొక్క పట్టు బలపడేందుకు దారి తీసింది. ఇది నయా ఉదారవాద విధానాలతో పాటు పెరుగుతూ వచ్చింది.
   వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి వడివడిగా ముందుకు సాగింది. మనం భూస్వాముల గురించి మాట్లాడితే, అది పెట్టుబడిదారీ భూస్వాముల గురించి అని అర్ధం చేసుకోవాలి. భూస్వాములు, ధనిక రైతులు, కాంట్రాక్టర్లను కలిగి ఉండే గ్రామీణ ధనిక వర్గం, గ్రామీణ వ్యాపార వర్గాల మధ్య అనుబంధం ఉద్భవిస్తుంది. భారత పాలక వర్గాల స్వభావం ఇప్పటికీ పెట్టుబడిదారీ తరహా భూస్వాములతో కలిసే బూర్జువా భూస్వామ్య వర్గమే. ఈ బూర్జువా భూస్వామ్య పాలక వర్గాలు, విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడికి సహకరిస్తాయి.


భారతదేశ కమ్యూనిస్టులకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పని చేసిన అనుభవం వుంది. వారు కూడా పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పాలించారు. ఈ అనుభవాలను (ముఖ్యంగా ప్రస్తుతం కమ్యూనిస్టులకు పార్లమెంట్‌లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న పరిస్థితుల్లో) మీరు ఎలా అంచనా వేస్తారు ?
  గత ఏడు దశాబ్దాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములైన భారతదేశ కమ్యూనిస్టులకు అపూర్వమైన అనుభవాలున్నాయి. ఇది నిరంకుశత్వానికి, వలసవాద స్థాపనలకు వ్యతిరేకంగా రష్యా, చైనా, వియత్నాంలలో జరిగిన విప్లవాల అనుభవం లాంటిది కాదు.
మొదట్లో 1948-1951 మధ్య కాలంలో ఉన్న వామపక్ష ఒంటెత్తు పోకడల (సెక్టేరియనిజం) తరువాత ప్రజా ఉద్యమాలను, విప్లవ పోరాటాలను బలోపేతం చేసేందుకు చట్టసభలలో కూడా పని చేయాలని కమ్యూనిస్టులు నిర్ణయించారు. 1957లో కేరళ అసెంబ్లీలో మొదటిసారి కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడం చెప్పుకోదగిన సంఘటన. ఇదే, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామి అయ్యేందుకు పునాది వేసింది. ఆ తరువాత కాలంలో పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
   1952 సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటులో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. నాటి నుంచి కమ్యూనిస్టులు ఎన్నికల రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటరీ రాజకీయాలలో మూకుమ్మడిగా పాలుపంచుకోవడం అనేక భ్రమలకు, సంస్కరణవాద ధోరణులకు దారి తీసినప్పటికీ, చట్టసభలకు వెలుపల ఉద్యమాలను బలోపేతం చేయడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఒక సరైన అవగాహన కమ్యూనిస్టులకు వుంది. ఉద్యమాలను ముందుకు తీసుకొని పోయేందుకు పార్లమెంట్‌ లోపల, వెలుపల ఎత్తుగడలను మిళితం చేయడం ఒక నిరంతర పోరాటం.
   వామపక్ష ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు, మొత్తంగా అది ఒక సానుకూలమైన అనుభవం. 1957లో కేరళలో మొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, భూసంస్కరణల అమలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యయుతంగా అధికార వికేంద్రీకరణ, కార్మికవర్గ ప్రజలకు సామాజిక భద్రత, మత సామరస్యం లాంటి అనేక విషయాలలో కమ్యూనిస్టులు ఒక మార్గాన్ని చూపించారు. ఇవన్నీ వామపక్షాల నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాల విజయాలు.
   కానీ, నయా ఉదారవాద విధానాల దశ ఉనికి లోకి వచ్చిన తరువాత వామపక్ష ప్రభుత్వాలు చూపించే ప్రత్యామ్నాయ విధానాలకు చోటు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ నిధులు, పెట్టుబడుల్లో కోత కారణంగా ప్రజానుకూల అభివృద్ధిలో తీవ్రమైన అవరోధాలు ఎదురైనాయి. గత రెండు సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం బాగా పడిపోవడం కూడా వాస్తవం. భారతదేశ రాజకీయాలలో మితవాద పార్టీ ప్రవేశం, నయా ఉదారవాద మార్కెట్‌ విధానాలు, ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేయడం, వ్యాపారం, రాజకీయాల మధ్య సానుకూలమైన అనుబంధం లాంటి అంశాలన్నీ, కమ్యూనిస్టుల, వామపక్షాల ఎన్నికల భవిష్యత్తుపైన చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపుతున్నాయి.


'నేడు ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ వ్యవస్థకు వాటిల్లుతున్న ప్రమాదం ఏనాడూ లేదని' ఇటీవల మీరన్నారు. అంటే '1975లో విధించిన ఎమర్జెన్సీ కన్నా నేడు భయానకంగా ఉందని' మీరు భావిస్తున్నారా? మనం ఎక్కడికి పోతున్నాం ?
    ప్రమాదం మరింత ఎక్కువగా, లోతుగా పొంచి ఉంది. అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలను, రాజ్యాంగాన్ని ఒక క్రమపద్ధతిలో బలహీనపరిచే నిరంకుశ హిందూత్వ ప్రభుత్వం ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నది. మరీ ముఖ్యంగా మోడీ నాయకత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, హిందూత్వ రిపబ్లిక్‌ పాలనే లక్ష్యంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక బహిర్గతమైంది. ఈ నిరంకుశమైన పాలనలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపైన, ప్రతిఘటిస్తున్న వారిపైన ఫాసిస్ట్‌ తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి 1975లో విధించిన ఎమర్జెన్సీ కన్నా మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిని దేనితోనూ పోల్చలేం. హిందూ రాజ్య స్థాపన కోసం... క్రమక్రమంగా భారతదేశాన్ని మొత్తంగా... భారీ పునర్నిర్మాణం చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు.


భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధిలో ఒక బలమైన, ప్రముఖమైన సాంస్కృతిక ఉద్యమం ఒక భాగంగా ఉంది. మేథావి వర్గాల పరిధిలో కూడా వామపక్షాలు కొన్ని దశాబ్దాల పాటు ప్రముఖమైన పాత్ర వహించాయి. కానీ నేడు, వామపక్ష ఉదారవాద బహిరంగ ప్రసంగాలను ఒక కొత్త జాతీయవాద కథనాలు భర్తీ చేస్తున్నాయని మితవాదులు వాదిస్తున్నారు. అదే విధంగా, ముఖ్యంగా కొత్త తరానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా హద్దూ అదుపూలేని వినిమయతత్వం, వ్యక్తి వాదం పట్ల విజయోన్మాదం కూడా ఉంది. వామపక్ష సాంస్కృతిక జోక్యానికి ఇది ఏ విధంగా సవాలుగా మారింది? మీకు పునరావిష్కరణ అవసరమా ?
   1930-1940 దశకాలలో కమ్యూనిస్టుల, ప్రగతిశీల వాదుల సంరక్షణలో అభివృద్ధి చెందిన సాంస్కృతిక ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఉండేది. అప్పుడు వామపక్ష జాతీయవాద విభాగం కూడా ఒకటి ఉండేది. కానీ ప్రగతిశీల, సాంస్కృతిక ఉద్యమంలో సాధించిన ఏకాభిప్రాయం (స్వాతంత్య్రం వచ్చిన ఒక దశాబ్ద కాలం తర్వాత మేథావులు, సాంస్కృతిక కార్యకర్తలు జాతీయ బూర్జువా వర్గం వెంట చేరి, ప్రభుత్వ ఏర్పాటులో నెహ్రూ ఆలోచనా విధానాలను ముందుకు తీసుకొని పోయే కార్యకర్తలుగా మారడం వలన) విఫలమైంది.
  కుల, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లాంటి లౌకిక, ప్రగతిశీల విలువలపైన రాజీ పడిన బూర్జువా ఉదారవాద సమూహాలను మనం చూశాం. 1980ల నాటికి వామపక్ష ప్రగతిశీల సాంస్కృతిక భావాలు మైనారిటీ ధోరణిగా మారాయి. ముఖ్యంగా వామపక్షాలు, కమ్యూనిస్టులు, వారి గత సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచరణలపైన బాగా ఆధారపడ్డారు. ప్రస్తుత సవాళ్ళను ఎదుర్కొనేందుకు వారు ఒక కొత్త సాంస్కృతిక మేల్కొలుపును, ఆవిష్కరణలను సృష్టించి, ఆ కొత్త సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలగాలి.
  హిందూత్వ జాతీయవాదాన్ని ఎదుర్కొనడం మరొక సవాల్‌. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ శక్తులు జాతీయవాదాన్ని ఉపయోగించుకోవడాన్ని మేం అనుమతించము. మెరుగైన జీవితం కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన, లౌకిక భావన, సామ్రాజ్యవాద వ్యతిరేకత కలిగిన జాతీయ వాదాన్ని, వామపక్షం ముందుకు తీసుకొని పోవాల్సి ఉంటుంది.
 

(తరువాయి రేపటి సంచికలో)