నిరంకుశ బిజెపిని ఓడించాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూరు
నిరంకుశ బిజెపి పాలనను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసురత్నం పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎంలు చేపట్టిన ప్రచారభేరి గురువారం ఆత్మకూరు పట్టణంలో మూడవ రోజు సాగింది. వాకిటి పేట, రాజా వీధి, ఎస్‌పిజి పాలెం, ఏబీఎన్ పాలెం, గొల్లపేట, వడ్లపేట, కల్లా విధి, కొత్తపేట మీదుగా నంద్యాల టర్నింగ్ వరకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, సిపిఐ కార్యదర్శి కె. శ్రీనివాసులు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అనేక భారాలు వేస్తూ లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును సైతం ప్రైవేటు వారికి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంద న్నారు. రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తోందన్నారు. ఈ సమస్యలన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఆ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో ఓడించాలని వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డిఎం. రజాక్, బి ఎస్ వలి, పి. సుధాకర్, వీరన్న,ఎన్. స్వాములు, డి. రామ్ నాయక్, సద్దాం హుసేన్ జాబిల్లా,సిపిఐ నాయకులు, అతావుల్లా, ప్రతాప్, వెంకట శివుడు, అహమ్మద్ హుసేన్, తాజద్దీన్,మహిళా సమాఖ్య నాయకురాలు స్వాతి, ప్రశాంత కుమారి,కార్యకర్తలు పాల్గొన్నారు. బేతంచెర్ల: సిపిఎం సీనియర్ నాయకులు వై ఎల్లయ్య, మండల కార్యదర్శి ఆర్ ఈశ్వరయ్య, పట్టణ కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బనగానపల్లె-డోన్ సర్కిల్ నందు ప్రచార భేరి పాదయాత్ర నిర్వహించారు. అంతుకుముందు స్థానిక రైల్వే గేట్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. దుర్గా పేట, బి ఆర్ పేట, వడ్డేపేట బోయపేట తహసిల్ పేటల నందు పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో రాజబాబు, నాగరాజు, నరసింహ, వెంకట రమణ, ఆంజనేయులు, అంకాలు, బద్రి, ఓబులేష్, చిన్న వెంకటేశు, చిన్నబ్బీ ,బి నాగరాజు,చిన్న నరసింహులు, పెద్ద నరసింహ పాల్గొన్నారు. బండి ఆత్మకూర్: సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సింగవరం, ఈర్నపాడు, కడమల కాలువ గ్రామాల్లో ప్రచారం భేరి నిర్వహించారు. మండల కార్యదర్శి రత్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేవిడ్, డివైఎఫ్‌ఐ నాయకులు రాజేష్, నాయకులు రాజశేఖర్, అశోక్, ఏసన్న, ఇమ్మానియేల్ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : ప్రధాని మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో దొర్నిపాడులో ప్రచార బేరి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాముడు మాట్లాడారు. ఏఐఎస్‌ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, సిపిఐ రుద్రవరం మండల కార్యదర్శి నరసింహులు, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










