ప్రజాశక్తి-మారేడుమిల్లి
నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న అతిథి అధ్యాపకుల డెమో క్లాసులను పరిశీలించారు. సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దని సూచించారు. మెనూ అమలు చేయడంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం మారేడుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని స్థానిక ఎంపీడీవో వీర కిషోర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ వెంకటరమణ, డిప్యూటీ తహశీల్దారు రాజు ఏకలవ్య పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.










