
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్మాణ రంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నిర్మాణ రంగానికి చెందిన మెటీరియల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇసుక, సిమెంట్, కంకర ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే రాజధాని వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి కారణంగా నాలుగేళ్లుగా నిర్మాణ రంగం బాగా దెబ్బతింది. కోర్టు ఉత్తర్వులతో రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మకంతో గత రెండేళ్లకాలంలో కొంత వరకు నిర్మాణాలు కొనసాగాయి. తాజాగా నిర్మాణ రంగ మెటీరియల్ ధరలు భారీగా పెరగడం, దసరాకు, ఆతరువాత డిసెంబరుకు విశాఖకు మకాం మారుస్తున్నట్టు సిఎం జగన్ చేసిన ప్రకటనతో నిర్మాణ దారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వరకు వేచిచూసే ధోరణితో ఉంటే మేలని బిల్డర్లు భావిస్తున్నారు.
మరోవైపు సిమెంట్ కంపెనీలు బస్తాకు రూ.50 నుంచి రూ.90 వరకు పెరిగాయి. రిటైల్‌లో ఒక్కో కంపెనీ డీలర్లు ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. గతనెల రోజుల్లో బస్తాకు రూ.50పైనే పెరిగింది. దీంతో స్థానిక వ్యాపారులు రూ.90 వరకు పెంచి అమ్ముతున్నారు. గత నెలలో కంకర టన్ను రూ.300 ఉండగా ఈనెలలో రూ.600కు పెంచారు. ఇనుము టన్ను రూ.5 వేల నుంచి ఆరు వేలవరకు పెరిగింది. గతనెలలో ఇనుము టన్ను రూ.60 వేలు ఉండగా ఈ నెలలో రూ.66 వేలకు చేరింది. మట్టి ధరలు లారీకి రూ.2000 పెంచారు. ఇలా నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయి.
తగ్గని ఇసుక ధరలు
జిల్లాలో ఇసుక ధరలు ఏమాత్రమూ తగ్గడం లేదు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. టన్ను ఇసుక రూ.1200పైన అమ్ముతున్నారు. నాలుగున్నరే క్రితం ఉమ్మడి జిల్లాలో ట్రాక్టరు ఇసుక రూ.1500 నుంచి రూ.2000 చెల్లిస్తే దొరికేది. 2019 జులై నుంచి ఇసుక విధానం మార్చారు. అప్పటి నుంచి ఈ విధానాంలో ఎన్నో మార్పులు చేసినా సరఫరా మెరుగుపడ లేదు. ధరలు తగ్గడం లేదు. ప్రస్తుతం గ్రామాలకు చేరే సరికి రీచ్‌లకు సమీపంలో ఉన్న వారికి సైతం ట్రాక్టరు ఇసుక రూ.4 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. 10 టన్నుల లారీ అయితే రూ.12,500, 30 టన్నుల లారీ అయితే మాత్రం రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. ఎక్కువ మోతాదులో రవాణ చేసుకుంటే ఛార్జీలను తగ్గిస్తున్నారు. తక్కువ మోతాదులో ట్రాక్టరు, చిన్న లారీలకు అయితే ధరలు పెంచుతున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి 15 కిలో మీటర్ల దూరంలోపు అయితేనే ట్రాక్టరు అనుమతిస్తున్నారు. అంతకంటే ఎక్కువ దూరం రానివ్వడం లేదు. దీంతో 30 టన్నులు లారీని ఒక్కరే తెప్పించుకుని రిటైల్‌గా టన్ను రూ.1200కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం నిర్ధేశించిన టన్ను రూ.475 నుంచి రూ.600 (రవాణా ఛార్జీలను కలిపి) ఎక్కడా విక్రయించడం లేదు. నిర్మాణ రంగం మందగించడం వల్ల గత నెల రోజులుగా ఇసుక విక్రయాలు కూడా తగ్గాయని వ్యాపారులు తెలిపారు.
తగ్గుతున్న ఉపాధి అవకాశాలు
వేర్వేరు కారణాలతో నిర్మాణ రంగం మళ్లీ సంక్షోభంలోకి వెళ్తుండటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. నెలలో 20 రోజులు కూడా పనులు దొరడంలేదు. గతంలో నెలలో 30 రోజులు పనులున్నా ఆదివారం, సెలవు దినాల్లో మినహా మిగతా అన్ని రోజుల్లో పనులకు వెళ్లేవారమని, ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు పనులు దొరుకుతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని కార్మికులు వాపోతున్నారు. ఈ ప్రభావం నిర్మాణ రంగంలో 32 రకాలకు చెందిన వ్యాపారులు, కూలీలపై పడుతుందని చెబుతున్నారు.