Sep 29,2023 23:16

బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి-విజయవాడ: బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన మెమో 1214ను రద్దు చేసి, యధాతదంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఎన్‌టిఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (డిసిఎల్‌) ఆషారాణికి రాయభార కార్యక్రమంలో భాగంగా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి నరసింహారావు మాట్లాడుతూ బిల్డింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లేబర్‌ అధికారులు కార్మికులకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో సంక్షేమ బోర్డుకు వివిధ పథకాల కోసం వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని, సుమారు రెండు వేల మందికి పైగా స్క్రూటినీ జరిగిందన్నారు. కానీ వారి అకౌంట్లలో పథకాలకు సంబంధించిన పరిహారాలు ఇంత వరకు జమ కాలేదన్నారు. జిల్లాలో ప్రతి లేబర్‌ ఆఫీసర్‌ పరిధిలో సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డుల కోసం వందలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి అప్పారావు, గౌరవాధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు, కోశాధికారి బి బెనర్జీ, నాయకులు ఎం బాబూరావు, బి గోవింద్‌, ప్రసాద్‌, సత్యనారాయణ, జోగేశ్వరరావు, రామకృష్ణ, భాస్కరరరావు తదితరులు పాల్గొన్నారు.