గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతులు, ఇతర మౌలిక సౌకర్యాలు నామమాత్రమే అన్న విషయం అందరికి తెలిసిందే. రెండవ విడత కరోనాను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న దాఖలాలు లేవు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు గతంతో పోలిస్తే తగ్గించినప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు తగ్గడం లేదు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని జనరల్ ఆస్పత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. నేలపైనే రోగులను పడుకోబెడుతున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయి. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల నుండి కూడా కేసులు పెరిగితే పరిస్థితి ఊహించుకోవడానికే భయం కలుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకునే విధానం కాకుండా తక్షణమే స్పందించాలి. ముందుగా పారదర్శకంగా వ్యవహరించాలి. పాజిటివ్ కేసులు, మరణాల విషయంలో వాస్తవ సంఖ్యలను వెల్లడించాలి. ఏ ప్రాంతం హాట్‌జోన్‌గా ఉందో తెలిస్తే ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించడానికి వీలవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఈ సమాచారం మరింత ఉపయోగంగా ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇప్పటికైనా బలోపేతం చేయాలి. యుద్ధ ప్రాతిపదిక మీద వాటిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించడంతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్ సౌకర్యంతో బెడ్లను అందుబాటులో ఉంచాలి. అవసరాన్ని బట్టి జిల్లా కేంద్ర ఆసుపత్రులకు రోగులను తరలించడానికి అవసరమైన రవాణా వసతిని కల్పించాలి. గ్రామాలలోని పాఠశాలలతో పాటు, అవకాశం ఉన్న అన్ని ఇతర భవనాలనూ కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలి. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేయడం, ఔషధాలతో పాటు అవసరమైనవన్నీ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చూసి అన్ని అస్పత్రులకూ సరఫరా జరిగేటట్టు చూడటం అవసరం. ఉపాధి హామీ పనులు అదనంగా మంజూరు చేయడం, పనులకు పోవడం సాధ్యం కాని హాట్‌జోన్ల లోని గ్రామీణ పేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించడం కూడా చాలా ముఖ్యం. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా వైరస్ నివారణ కృషిలో క్రీయాశీల బాధ్యతలను అప్పగించాలి. సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు సచివాలయ వ్యవస్థలోని వాలంటీర్లు ఇతర సిబ్బందిని భాగస్వామ్యం చేయడం ద్వారా పరీక్షలు విస్తృతంగా చేయడం, రోగులను గుర్తించడం, ఐసొలేట్ చేసి, అవసరమైన చికిత్స చేయడం వంటి పనులు వేగంగా చేయడం సాధ్యమవుతుంది. ఎలాగూ బడ్జెట్ సమావేశం జరుగుతోంది కాబట్టి, అవసరమైన నిధులను బడ్జెట్ లోనే కేటాయించాలి.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థలకు అధికారాలను, నిధులను కేటాయించడం ద్వారా వాటి ప్రతినిధులే కరోనాపై పోరులో ముందు వరసలో నిలుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ కచ్చితంగా అమలు చేయడంతో పాటు, అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచడం, నిత్యావసర వస్తువులు అందరికీ అందేలా చూడటం వంటి బాధ్యతలను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అప్పచెప్పడం కేరళలో సత్ఫలితాలనిస్తోంది. ఈ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి. పార్టీలకతీతంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలోనూ ఏకపక్ష విధానాలను విడనాడాలి. ప్రతిపక్షాలను కలుపుకు పోవాలి. ఆసక్తి ఉన్న ప్రజాసంఘాలనూ, స్వచ్ఛంద సంస్థలను క్షేత్రస్థాయిలో భాగస్వాములు చేయాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ఆలస్యం చేయకుండా విస్తృత భాగస్వామ్యం ద్వారా చేపట్టే తక్షణ కార్యాచరణే కరోనా పై పోరులో విజయానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.










