Aug 01,2023 22:49

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆగ్రహం
- నలుగురు వైద్యులు, డిపిహెచ్‌ఎన్‌కు షోకాజ్‌ నోటీసులు
- టెక్కలి డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పలాసకు బదిలీ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో సాకులు వెతకడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్‌సిడి సర్వే, బిపి, షుగర్‌ చికిత్సల ఆన్‌లైన్‌ నమోదులో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ గంగువాడ, చొర్లంగి, మాకివలస, సింగుపురం వైద్యులకు, డిపిహెచ్‌ఎన్‌ శైలజకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. టెక్కలి డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లకీëతులసిని పలాస డివిజన్‌కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఎన్‌సిడి ప్రోగ్రాం అధికారి సి.పి శ్రీదేవిని సెలవుపై వెళ్లిపోవాలన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ లింగరాజు పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిభ కనబరిచిన కింతలి, తొగరాం పిహెచ్‌సి వైద్యాధికారులను అభినందించారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం ద్వారా మెరుగైన వైద్యం అందించాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి ప్రసవానికి ఏడు రోజుల ముందే సిహెచ్‌సిలో, ఏరియా ఆసత్రిలో చేర్పించాలని చెప్పారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యాపై వాలంటీర్ల సహకారంతో శతశాతం ఫీవర్‌ సర్వే చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఎడిఎంహెచ్‌ ఎన్‌.అనురాధ, డిఐఒ ఆర్‌.వి.ఎస్‌ కుమార్‌, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ లక్ష్మీతులసి, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త పి.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.