Nov 07,2020 07:23

         మోడీ ప్రభుత్వం సెప్టెంబర్‌లో మూడు లేబర్‌ కోడ్‌ బిల్లులను పార్లమెంట్‌లో పాస్‌ చేసింది. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌ను బహిష్కరించిన సమయంలో ఎటువంటి చర్చ లేకుండా వాటిని పాస్‌ చేసింది. కార్మిక వ్యతిరేక సంస్కరణల్లో నిర్ధారిత కాలపరిమితి ఉద్యోగాలను ప్రవేశ పెట్టడం ఒక ముఖ్యమైన భాగం. 6 నెలలకో, సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాలకో నిర్ధారిత కాలానికి పనిలో పెట్టుకోబడిన కార్మికులు నిర్ధారిత కాల పరిమితి కార్మికులవుతారు. కాలపరిమితి పూర్తికాగానే ఆటోమేటిక్‌గా తమ పని నుండి కార్మికులు తొలగించబడతారు. నోటీసు కూడా ఇవ్వనవసరం లేదు.
       పారిశ్రామిక సంబంధాల కోడ్‌ ''నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగా''న్ని ఈ విధంగా నిర్వచించింది. ''నిర్ధారిత కాలపరిమితి ఉద్యోగమంటే నిర్ధారిత కాలానికి రాతపూర్వక ఒప్పందం ద్వారా కార్మికుడిని పనిలో పెట్టుకోవడం''.
అదే కోడ్‌లో ''పరిశ్రమ (ఇండిస్టీ) అంటే యజమాని - కార్మికుడి మధ్య సహకారం ద్వారా సరుకులు లేదా సర్వీసుల ఉత్పత్తి, సరఫరా లేదా పంపిణీ కోసం ఒక పద్ధతి ప్రకారం జరిగే కార్యకలాపం''.
      ''పారిశ్రామిక సంస్థ లేదా అండర్‌ టేకింగ్‌ అంటే ఒక సంస్థ లేదా అండర్‌ టేకింగ్‌లో పరిశ్రమ కార్యకలాపం కొనసాగేది''.
పరిశ్రమ నిర్వచనం నుండి ప్రభుత్వ శాఖలను, దాతృత్వ సంస్థలను, స్వచ్ఛంద సంస్థలను, ఇంటి పనిని, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ఏదైనా ఇతర కార్యకలాపాన్ని మినహాయించారు. ఇవి మినహా మిగతా అన్ని పని ప్రదేశాల్లో నిర్ధారిత కాల పరిమితి
ఉద్యోగాలు ప్రవేశిస్తాయి. అన్ని పరిశ్రమలు, సంస్థలు, షాపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు / పరిశ్రమలకు వర్తిస్తుంది.
2003లో మైనార్టీ వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగాలను ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తే కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి తిప్పికొట్టింది. 2014లో అదే బిజెపి సొంతగా పెద్ద మెజార్టీతో అధికారం లోకి రావడంతో కార్మిక రంగంలో కార్మిక వ్యతిరేక సంస్కరణల అంకాన్ని ప్రారంభించిన మోడీ ప్రభుత్వం 2020 కల్లా పూర్తి చేసింది.
        నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగులకు కూడా అదే సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్‌ కార్మికుల వేతనాలు, ప్రయోజనాలు, హక్కులు అమలు చేయాలని కోడ్‌లో ఉంది. కొద్ది కాలం మాత్రమే ఉద్యోగంలో ఉండే కార్మికులకు తమ యజమానులతో పోరాడి వాటిని అమలు చేయించుకునే సత్తా ఉండదు. అలా పోరాడితే తమను యజమాని తిరిగి ఉద్యోగంలో పెట్టుకోడనే భయం వారిని వెంటాడుతుంది. ఒకే కార్మికుని అదే పనిలో ఎన్నిసార్లయినా యజమానులు నియమించుకునే లేదా నియమించకుండా ఉండే అధికారం యజమానులకు వచ్చింది.
         రాబోయే కాలంలో పర్మినెంట్‌ ఉద్యోగాలు కనపడకుండా పోతాయి. ప్రస్తుతం ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగాలను నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగాలుగా మార్చటాన్ని పారిశ్రామిక సంబంధాల కోడ్‌ నిరోధించ లేదు. మోడీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగాలను 2016 నుండి ఒక్కో రంగంలో ప్రవేశ పెట్టుకుంటూ వచ్చింది. 2016లో దుస్తుల రంగంలో, 2017లో తోలు మరియు పాదరక్షల రంగాల్లో, ఆ తర్వాత 2018లో అన్ని పరిశ్రమల్లో కేవలం ఇండిస్టియల్‌ ఎంప్లాయిమెంట్‌ (స్టాండింగ్‌ ఆర్డర్స్‌) రూల్స్‌ను నోటిఫికేషన్‌ ద్వారా పదే పదే మార్చుకుంటూ ప్రవేశ పెట్టింది.
         2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్‌లో మార్పులపై చర్చలు జరిగి పాస్‌ కాకుండానే నిరంకుశ పద్ధతుల్లో నోటిఫికేషన్లతో నిర్ధారిత కాల పరిమితి ఉద్యోగాలను ప్రవేశ పెట్టుకుంటూ వచ్చింది. పెట్టుబడిదారుల సేవలో మునిగి తేలుతున్న మోడీకి కార్మిక ప్రయోజనాలు కంటికి కనపడటం లేదు. 2020లో ఏకంగా పారిశ్రామిక సంబంధాల కోడ్‌ ప్రధాన భాగంలోనే నిర్ధారిత కాలపరిమితి ఉద్యోగాలను చేర్చి పార్లమెంట్‌లో పాస్‌ చేసింది. కార్మికులను యజమానుల దోపిడీ కోరల్లోకి నెట్టింది. కాంట్రాక్టు కార్మికులు కూడా నిర్ధారిత కాలపరిమితి కార్మికులుగా మార్చబడే ప్రమాదం ఉంది.
          2020, నవరబర్‌ 26 న దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున చేరి మోడీ ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పాలి. మతం, దేశభక్తి, చైనా, పాకిస్తాన్‌ తదితర పేర్లతో కార్మికులను దారి మళ్ళించడాన్ని సహించకూడదు. కార్మిక ఐక్యతే కార్మిక ప్రయోజనాలను రక్షిస్తుంది. కార్మికులను విభజించి పరిపాలించే మోడీ ఎత్తుగడలను ఓడించాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కార్మిక వ్యతిరేక కోడ్‌లకు అనుకూలంగా ఓట్లు వేసిన రాష్ట్రంలోని వైసిపి, టిడిపి ల వైఖరిని బట్టబయలు చేయాలి.

( వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు )

పి.అజయ కుమార్‌

p.ajay kumar