Sep 28,2023 22:49

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : విభాగాల వారీగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్‌ జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు, మచిలీపట్నం కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ తో కలసి పాల్గొన్నారు. రీసర్వే, జగనన్న ఆరోగ్య సురక్ష, వ్యవసాయం, జగనన్న పాలవెల్లువ, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, జాతీయ రహదారులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వఛ్చతా హీ సేవ, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై ఆయన సమీక్షించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో జిల్లాకు సంబంధించిన పలు అంశాల పురోగతిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కలెక్టర్‌ వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ-క్రాప్‌ నమోదు ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేశామని, గడువు తేదీ ఈ నెల 30కల్లా మిగిలిన భాగం పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా పీఎం కిసాన్‌ ఈకేవైసి 92 శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన భాగం పూర్తి చేయడంలో సమస్యలు ఉన్నట్లు చెప్పారు. సంబధిత భూ యజమానులు వేరే ప్రాంతాలకు వలసపోవడం, ఫోన్‌ ఓటీపీ ద్వారా సైతం ఈకేవైసి చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వారి ఫోన్‌ నంబర్లు పని చేయకపోవడం వంటి కారణాల వల్ల నూరు శాతం పూర్తి కాలేదని తెలిపారు. కౌలు సాగు చేసుకునే రైతులకు జిల్లాలో ఇప్పటి వరకు 57,133 కౌలు కార్డులు మంజూరు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో డీఆర్‌డీఏ పీడీ పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సర్వే భూ రికార్డుల ఏడి టి.వెంకటేశ్వరరావు, డీఎల్‌ డిఓ సుబ్బారావు, మార్కెటింగ్‌ ఏడి నిత్యానంద, పంచాయతీరాజ్‌ ఎస్‌ ఈ విజయకుమారి, పాల్గొన్నారు.