Sep 25,2023 23:38

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో అంగన్వాడీలను పరామర్శిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సోమవారం విజయవాడ మహాధర్నాకు వెళ్తుండగా వివిధ జిల్లాలకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ప్రకాశం, అనంతపురం, పల్నాడు జిల్లాలకు చెందిన 65 మంది తీసుకురాగా వారిని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఇ.అప్పారావు, పి.బాలకృష్ణ, ఎం.ఫకీరయ్య, వై.కమలాకర్‌, ఎం.భాగ్యరాజు, టి.శ్రీనివాసరావు, షేక్‌ జానీబాష, బి.కోటేశ్వరి, ఎ.సామ్‌రెడ్డి పరామర్శించారు. అంగన్వాడీలను విడుదల చేయాలని స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావును పోలీసులు బందరు రోడ్డులో అరెస్టు చేశారు. పెదకాకాని స్టేషన్‌కు తెచ్చిన అంగన్వాడీలను యూనియన్‌ నాయకులు పి.రాధా, ఎన్‌.శివాజీ పరామర్శించారు. హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, సమస్యలను పరిష్కరించపోగా నిర్బంధాలు దారుణమని అన్నారు. అయినా ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అంగన్వాడీల అరెస్టును జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఖండించారు. అంగన్వాడీలకు ఎన్నో హామీలచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని నిస్మరించారన్నారు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చాలని అడుగుతుంటే వారిని అరెస్టు చేసి, భయపెట్టడం అప్రజాస్వామికమన్నారు. అంగన్వాడీల పోరాటానికి జనసేన పార్టీ మద్దతునిస్తోందని స్పష్టం చేశారు. అరెస్టులను ఖండిస్తూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని బ్యాంక్‌ సెంటర్‌ నుండి పోలీస్‌ స్టేషన్‌, ఐలాండ్‌ సెంటర్‌ వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడారు. బి.వెంకటేశ్వర్లు, ఎస్‌.వెంకటకృష్ణ, హజర, శివరంజని, సుజాత, రామలక్ష్మి, వెంకటరమణ, జయశ్రీ, శాంతికుమారి, సుహాసిని, శైలజ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటే పోలీసులతో అరెస్టు చేయించడం సిగ్గుమాలిన చర్యని సిఐటియు గుంటూరు జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, వై.నేతాజీ, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలనున నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా సోమవారం విజయవాడ మహాధర్నాకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ శాంతియుతంగా విజయవాడలో ధర్నా చేయటానికి సిద్ధపడితే సమస్యలు పరిష్కారం చేయటం చేతకాని ప్రభుత్వం, నిన్నటి నుండి మహిళల ఇళ్లకు పోలీసులుని పంపి నోటిసులు ఇచ్చి బెదిరించారన్నారు. చాలా చోట్ల పోలీస్‌ స్టేషన్లో నిర్బందిచారని, విజయవాడ చేరుకొన్నా వేల మంది అంగన్వాడి వర్కర్లను అరెస్టుల చేసి, విజయవాడలో అన్ని పోలీస్‌ స్టేషన్లల నిర్బందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పొలీసుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, తెలంగాణా కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలి, తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీని ఇవ్వాలి, ఎఫ్‌ఆర్‌ఎస్‌ మరియు వివిధ రకాల యాప్‌ లను రద్దు చేయాలని, 62 ఏళ్లకు రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని, ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అరెస్టులను సిపిఎం సత్తెనపల్లి పట్టణ, రూరల్‌ కమిటీలు ఖండించాయి. ఈ మేరకు స్థానిక పుతుంబాక భవన్‌లో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు డి.విమల, పి.మహేష్‌, నాయకులు ఎ.వెంకటనారాయణ, జె.రాజ్‌కుమార్‌ విలేకర్లతో మాట్లాడారు.