Mar 14,2023 23:47

అప్పలరాజును ఎత్తుకుని పక్కకు తీసుకు వెళ్తున్న పోలీసులు

దళితుల పొట్ట కొట్టొద్దని సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన
పోలీసు పహారాలో తలుపు మూసేసి వేలం నిర్వహణ
అడ్డుకున్న ఆందోళనకారులను ఈడ్చేసిన పోలీసులు
వాగ్వాదం, తోపులాటలతో ఆద్యంతం ఉద్రికత్త
ప్రజాశక్తి-నక్కపల్లి :
మండలంలోని గునుపూడి శివారు బంగారమ్మపేట గ్రామంలోని జీడితోటలు ఫలసాయానికి మంగళవారం నిర్వహించిన వేలం ఆద్యంతం ఉద్రిక్త వాతావరణంలో నిర్బంధం నడుమ నిర్వహించారు. ల్యాండ్‌ సీలింగ్‌ కింద తమకు ఇచ్చిన భూములు, తమ అధీనంలో ఉండివాటి ఫలసాయంతో ఇన్నాళ్లు జీవనోపాధి పొందుతున్న పరిస్థితుల్లో ఆ తోటలను వేలం వేసి ఉపాధికి హరించొద్దని వేడుకున్నారు. దీంతో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణంలో వాగ్వాదాలు, తోపులాటలు, పోలీస్‌ పహారా నడుమ అధికారులు వేలంపాట నిర్వహించారు.
మండలంలోని గునుపూడి శివారు బంగారమ్మపేట గ్రామం సర్వే నెం. 195, 196, 197లో 70 ఎకరాలు విస్తీర్ణంలోగల జీడితోటలో జీడిపిక్కల ఫలసాయాన్నిఈ ఏడాది తీసుకొనుటకు మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటలో నర్సీపట్నం ఆర్‌డిఒ జయరాం పాల్గొన్నారు.. కాగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో గునుపూడి గ్రామానికి చెందిన దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు వేలం పాట రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ఆర్‌డిఒ, తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వేలంపాటను నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.అయితే కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహిరు. 196,196/8,202/9 లలో సుమారుగా 38 ఎకరాలను 19 కుటుంబాలకు 1976లోనే ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా పట్టాలిచ్చిందని, నాటి నుంచి ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీడితోటల ఫలసాయం తమకే దక్కాలని, వేలం పాట రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, పదేపదే వేలం వేసేందుకు రావడం అన్యాయమని ఆవేదన వెలిబుచ్చారు. వేలం పాట నిర్వహించకూడదని పెద్ద పెట్టున నినాదాలు చేసారు. వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా ఆందోళనకారులు బైఠాయించారు.
ఎస్‌ఐ శిరీష సిబ్బందితో కలిసి తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, వేలంపాటను అడ్డుకుని తీరతామని స్పష్టం చేయడంతో ఎస్‌ఐ శిరీష ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా బయటకు లాగేసి వేలంపాటదారులను కార్యాలయంలోకి పంపించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో, తలుపుగడియ పెట్టుకుని అధికారులు వేలం పాటను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు, పాలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు తలుపు వద్ద బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేసారు. వేలం పాట పూర్తయిన తర్వాత ఆర్డీవో జయరాం బయటకు వస్తుండగా ఆందోళనకారులు అడ్డుతగిలారు. కారు ముందు బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్‌డిఒ వెళ్లిన తర్వాత కూడా అధికారులు ,పోలీసులు తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రూ.10.70 లక్షలకు వేలం పాట ఖరారు
నర్సీపట్నం ఆర్‌డిఒ జయరాం సమక్షంలో నిర్వహించిన వేలంపాటలో ఈ ఏడాదికి జీడితోట పిక్కల ఫలసాయం పొందేందుకుు బంగారమ్మ పేట గ్రామానికి చెందిన కొవిరి రమణ రూ.10.70లక్షలకు దక్కించుకున్నారని ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ నీరజ తెలిపారు. వేలం పాట ఖరారు చేసినట్లు వెల్లడించారు.
దౌర్జన్యంగా వేలం పాట : సిపిఎం
దళితుల నోరు నొక్కి దౌర్జన్యంగా వేలంపాట నిర్వహించడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం అప్పలరాజు విమర్శించారు. వేలం పాటదారులతో రెవెన్యూ అధికారులు, పోలీసులు కుమ్మక్కై, దళితులపై దౌర్జన్యం చేసి వారి పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ స్పందించి నిబంధనలుకు విరుద్ధంగా, నిర్బంధంతో నిర్వహించిన జీడితోటల వేలం పాటను రద్దు చేయాలని గూనుపూడిలో గతంలో పట్టాలు పొంది 19 కుటుంబాలకు 38 ఎకరాలు అప్పజెప్పి,మిగతా 22 ఎకరాలను బంగారమ్మపేటలో పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.
న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు కార్యక్రమంలో వాతాడ అప్పారావు, గంటా చిన్నారావు, మాసా జోగారావు,మాసా అప్పారావు, పల్లా అప్పారావు, అయినంపూడి శ్రీను, గాలింక లోవమ్మ, మాసా పెద్ద అప్పియ్యమ్మ పాల్గొన్నారు.