
ప్రజాశక్తి - హిందూపురం : అంగన్ వాడీ ఉద్యోగులు ఆందోళనకు దిగితే వారిని అక్రమంగా నిర్బందించడం ప్రభుత్వ చేతగానితనాకి నిదర్శనం అని సిఐటియు జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఎక్కడిక్కడా అంగన్ వాడీ కార్యకర్తలను నిర్బంధించడాన్ని నిరసిస్తు సిఐటియు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున అంగన్ వాడి కార్యకర్తలు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వెంటకేష్ మాట్లాడుతుతమ న్యాయమైన కోరికల కోసం ఎన్నో ఏళ్లగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు, వెంటనే అంగన్ వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పి నరసింహప్ప, అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు శిరీష, వరలక్ష్మి, సుమియా, పద్మక్క, భాగ్యమ్మ, శివమ్మ, రాజమ్మ, రూప, శశి, రిహానా తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ నాయకురాలు దిల్షాద్ డిమాండ్ చేశారు సోమవారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు ముందు అంగన్వాడీ వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సూపర్వైజర్‌కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాసంతి, వసంత, ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : అంగన్వాడీ అరెస్టులు ప్రజాస్వామికమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, జిల్లా కమిటీ సభ్యులు అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై శాంతియుతంగా విజయవాడలో మహధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా, అమానుషంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్భందాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఈ ఘటనను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అంగన్వాడీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓబుల దేవర చెరువు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, అంగన్వాడి యూనియన్ లీడర్లు వరలక్ష్మి, మేరీ సుజాత, కమల ,షమీం, రత్నమ్మ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మమదాబాద్ క్రాస్ వద్ద గల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినిత పత్రాన్ని సిడిపిఒ వరలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు స్వర్ణ, సుకన్య, చంద్రకళ, మంజుల, వెంకట నరసమ్మ, సునంద తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : తమ సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని సిఐటియు మండల కార్యదర్శి అయూబ్ ఖాన్, రైతుసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జెవి. రమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు సోమవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పుప్రకారం గ్రాట్యూటీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు సరస్వతి, చంద్రకళ, అంగన్వాడీలు గోవిందమ్మ, పోతక్క, దీన, అరుణ, రత్నమ్మ, అనిత, కృష్ణవేణి, లలిత, భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకున్నంత మాత్రానా ఉద్యమాలు ఆగవని సిఐటియు నాయకులు జగన్మోహన్ అన్నారు. చలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కదిరి సిడిపిఒ ప్రాజెక్టు ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈనెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిడిపిఒ రాధికకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిఎల్. నరసింహులు, జగన్మోహన్, ముస్తాక్ అలీ తో పాటు అంగన్వాడీ యూనియన్ నాయకులు మాబున్నిసా, సుశీల, సుజాత, సువర్ణ, సరోజ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తలపెట్టిన మహాధర్నాను భగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అంగన్వాడీ సిబ్బందిని నిర్బంధాలతో ఆపివేయడం హేయమైన చర్య అని సిఐటియు మండల కార్యదర్శి బాబావలి పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్స్‌పై సోమవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణకి వినతి పత్రం సమ ర్పించారు. బాబావలి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం రూ. 26 వేలు, సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు, ఆఖరి వేతనంలో సగం పెన్షన్, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు, తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు మాబున్నీసా, బావమ్మ పాల్గొన్నారు.
మడకశిర : సమస్యల పరిష్కారం కోసం 'చలో విజయవాడ' కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీ సిబ్బంది అరెస్టుకు నిరసనగా సోమవారం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు అడ్డుకోవడం దారుణ మన్నారు. అనంతరం సిడిపిఒకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గీతా బాయి, వెంకమ్మ, సునందమ్మ, అనితమ్మ, మంజుల, నరసమ్మ, తిమ్మక్క, భాగ్యమ్మ, రంగమ్మ, గంగమ్మ ఉన్నారు.
సోమందేపల్లి : అంగన్వాడీ వర్కర్స్ నిర్బంధాన్ని నిరసిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో లో సిఐటియు జిల్లా కార్యదర్శి పెడపల్లి బాబా, మండల నాయకులు రాజగోపాల్, చాంద్‌బాషా, మాబు, అంగన్వా డీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు అరుణ, నాగమణి, పద్మావతి, ప్రమీలమ్మ, అరుణ, భాగ్యమ్మ, చంద్రకళ పాల్గొన్నారు.
గుడిబండ : విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించినట్లు అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, దేవీరమ్మ తెలిపారు. పోలీసుల వైఖరి పట్లఅంగన్వాడీ వర్కర్లు, ఆయాలు మండిపడ్డారు.