
నిర్బంధాలు.. అణిచివేతలు..
- ఎక్కడికక్కడ అంగన్‌వాడీల అరెస్టు
- రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే.. ఉదయం విడుదల
- నిర్భంధాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
- సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్‌వాడీలు వెళ్లకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించారు. నంద్యాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను అరెస్టు చేసి రాత్రంతా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సోమవారం ఉదయం వారిని విడిచిపెట్టారు. పాణ్యంలో సిఐటియు నాయకులు భాస్కర్‌ను ఉదయం నుండి రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అంగన్వాడీలు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తూ అరెస్టులు చేశారు. ఇందుకు నిరసనగా సోమవారం నంద్యాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. ప్రభుత్వం చర్యలను, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అడిగేందుకు విజయవాడకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో అంగన్వాడీలపై పని భారం పెంచడం మానుకోవాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో శాంతియుతంగా ఆందోళన చేసేందుకు అనుమతినిచ్చి వెళ్లకుండా అరెస్టు చేసి నిర్భంధించడం ప్రభుత్వ కుటిల నియంత పాలనకు అద్దం పడుతోందన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె.మహమ్మద్ గౌస్, కోశాధికారి వెంకట లింగం, పాణ్యం మండల కార్యదర్శి భాస్కర్‌లు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మి, కొండమ్మ, సారమ్మ, అరుణలు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందన్నారు. సెంటర్ల నిర్వహణ బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలిపారు. తెలంగాణా కంటే రూ.1000 ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన సిఎం హామీ నెరవేర్చ లేదని, పైగా వివిధ రకాల యాప్‌లతో ఇబ్బందులు పెడుతూ మానసిక వత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇచ్చిన హామీలను సిఎం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ శారదకు వినతిపత్రం సమర్పించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పీడీ హామీనిచ్చారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు సుబ్బరత్నాలు, లలిత, ఎలిజబెత్తు, ప్రసన్న, లక్ష్మి ఆశీర్వాదం, కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.