ప్రజాశక్తి - ఏలూరు
ప్రజాస్వామిక హక్కులను హరించి ప్రజాఉద్యమాలపైన, ప్రతిపక్ష నాయకులపై నిర్బంధ చర్యలు చేపట్టడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం తీవ్రంగా విమర్శించారు. స్థానిక పవర్‌పేటలోని ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రజాసమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ప్రజాసమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను నిర్బంధ చర్యలు ద్వారా అణచివేసే చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాఉద్యమాలు మరింత పెరుగుతాయన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల శంఖారావ దీక్షకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
అగ్రిగోల్డ్ బాధితులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోవాల్సి వస్తుందన్నారు. మెట్టప్రాంత మండలాల్లోని చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో సాగు, తాగునీటి సమస్య తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో 45 శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని ఫలితంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి సహాయకచర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫలితంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి పరిహారమిచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఇతర ఇన్‌పుట్స్ అందించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ కార్మికులకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ జిల్లాలో అనేక ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు పెరిగి కార్మికుల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే రోడ్లు బాగు చేయాలని కోరారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా మార్చడంతో రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తగిన డాక్టర్లు, సిబ్బంది లేరని, రోగుల బెడ్స్ సంఖ్య సగానికి కుదించివేశారన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూడాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్, ఆర్.లింగరాజు, పి.కిషోర్, జి.రాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ, ఎ.ఫ్రాన్సిస్, బి.సోమయ్య, గుడిపాటి నరసింహారావు పాల్గొన్నారు.










