
పార్వతీపురం రూరల్: ప్రజల వాణిని వినిపించే నాయకులను గృహనిర్బంధాలు విధించినంత మాత్రాన వైసిపి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎవరూ అడ్డుకోలేరని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రను టిడిపి నాయకులు అడ్డుకొని నలుపు రంగు బెలూన్లతో నిరసన తెలియజేస్తారన్న ముందుస్తూ సమాచారంతో రూరల్ పోలీసులు, ప్రధాన పార్టీ నాయకులతో పాటు ఇన్చార్జి విజయచంద్రను, మండలంలోని కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏమాత్రం సామాజిక న్యాయం జరిగిందని ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్షాల గొంతును పోలీసుల సహాయంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని నొక్కుతున్నారని విమర్శించారు. పట్టణాన్ని పచ్చదనంతో సంరక్షిస్తే రాత్రికి రాత్రే చెట్లను నరికించి పట్టణానికి శ్మశాన శోభను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. అధికారులు ఎవరి సూచనల మేరకు ఈ దుర్వినియోగానికి పాల్పడ్డారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అలాగే రాజకీయ పార్టీల యాత్ర కోసం దగ్గరుండి పట్టణానికి హాని కలిగించేలా స్థానిక ఎమ్మెల్యే చెట్లను తొలగించడాన్ని ప్రోత్సహించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకున్నంత మాత్రాన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అడ్డుకోలేరని ఇప్పటికైనా నాయకులు వాస్తవాలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, పోలా సత్యనారాయణ, బోను చంద్రమౌళి, బుడితి శ్రీరామ్ తో, పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.
కురుపాం : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులను పెట్టడం వైసిపి ప్రభుత్వం మానుకోవాలని టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితమైన రాజకీయాలు చేసి టిడిపి శ్రేణులకు ఇబ్బందులు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తుందని తప్ప పరిపాలన ఏమీ లేదని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి చంద్రన్న ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కెవి కొండయ్య, టిడిపి నాయకులు వి.భారతి పాల్గొన్నారు.