ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. అయినా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వందలాది మంది ఆందోళనలో పాల్గొన్నారు. తొలుత గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి డిఎం అండ్‌హెచ్‌ఒ కార్యాలయం వరకూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్‌ఒ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని గేట్లు మూసివేశారు. దీంతో ఆశాలు గేటు ఎదుటే బైటాయించారు. డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ శ్రావణ్‌బాబు ఆశాల ఆందోళన వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి, ఇతర నాయకులు అధికారులకు సమస్యలను వివరించి, వినపత్రం అందజేశారు. వినతిపత్రం స్వీకరించిన డిఎఅండ్‌హెచ్‌ఒ రెండ్రోజుల్లో ఆశాల జాబ్‌చార్ట్‌పై స్పష్టమైన సర్క్యులర్ విడుదల చేస్తామని, జిల్లా స్థాయిలో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో స్టేషన్ రోడ్‌లోని ధర్నాచౌక్‌లో బహిరంగ సభ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భూలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా డిఎంహెచ్‌ఒ కార్యాలయానికి వెళ్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.శోభారాణికి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాకు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి.
గుంటూరులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ఆశా వ్యవస్థ ఏర్పాటు చేశారని, కానీ 17 ఏళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు ఇవ్వకుండా, జాబ్‌చార్ట్‌తో సంబంధం లేని విధులు అప్పగిస్తున్నారని చెప్పారు. నాణ్యత లేని సెల్‌ఫోన్లు ఇచ్చి, 14 రకాల యాప్‌లు పెట్టి సమాచారం అప్‌లోడ్ చేయాలని అంటున్నారన్నారు. వెయ్యి జనాభాకు ఒక ఆశా ఉండాలని, కానీ 1400 జనాభా నుండి 2 వేల మంది ఉన్నా ఒక్కరితోనే పని చేస్తున్నారని తెలిపారు. పనిభారంతో అనారోగ్యం బారిన పడి ఆశాలు చనిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లు అని గొప్పగా కీర్తించిన ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వ విధులకు హాజరైతే టిఎ బిల్లులు ఇవ్వట్లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వట్లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మెటర్నిటీ లీవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు.
ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ న్యాయమైన సమస్యలపై ధర్నా చేస్తామని రాష్ట్రస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకూ ముందుగానే నోటీసులు ఇచ్చినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదన్నారు. ధర్నాను విచ్ఛిన్నం చేయటానికి అధికారులు ఆశాలపై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆశాల ఇళ్ల వద్దకు పోలీసుల్ని పంపించి బెదిరించే ప్రయత్నం చేసిందన్నారు. నిర్బంధాలను అధిగమించి ఆందోళనకు పెద్ద ఎత్తున వచ్చిన ఆశాలకు ఆయన అభినందనలు తెలిపారు. చాకిరి బారెడు, జీతం మూరెడు అన్న చందంగా ఆశాల ఉద్యోగం తయారైందని, కేవలం రూ.10 వేల జీతం ఇస్తూ తీవ్రమైన పనిభారం మోపుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో గతంలో ఇచ్చిన పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారన్నారు. ఇస్తున్న జీతంలో సచివాలయాలకు, పిహెచ్‌సిలకు వెళ్లటానికి టిఎ బిల్లులకే ఒక్కొక్కరూ రూ.3 వేలు భరించాల్సి వస్తోందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో ఆశాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నగర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మి, కె.జ్యోతి, నాయకులు ఎన్.ధనలక్ష్మి, ఎన్.లక్ష్మి పాల్గొన్నారు.
నరసరావుపేటలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని, నోడల్ అధికారులు, సిహెచ్‌సి, వైద్య సిబ్బందితో బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రతినెలా 15-25 తేదీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేయకుంటే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎన్సీడీ సర్వే ఎఎన్‌ఎం చేయాల్సి ఉండగా ఆశాలతో చేయిస్తున్నారని, వ్యాక్సిన్ క్యారియర్ల్ల్ తేవడం భారమవుతోందన్నారు. సబ్ సెంటర్ పరిధిలో ఎంల్ హెచ్‌పిల పెత్తనం మితిమీరిందని, వేధింపులు తాళలేక రొంపిచర్ల మండలం అన్నవరానికి చెందిన ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. వివరాల నమోదుకు అందజేసిన ఫోను సామర్థ్యం సరిపోక సక్రమంగా పనిచేయడం లేదన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ 14 రకాల యాప్‌లలో పని, 26 రకాల రికార్డులు రాయాల్సి రావడం మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సెల్‌ఫోన్లు సరిగా పని చేయకపోతే సొంతంగా కొనుకోకవాలంటున్నారని మండిపడ్డారు. రికార్డులు కూడా సొంత డబ్బులతో కొనుగోలు చేయాలని, లేకుంటే వేతనాలు నిలిపివేస్తామని ఉద్యోగం నుండి తొలగిస్తామని అధికారులు బెదిరింపులు పెరిగాయన్నారు. విలేజ్ క్లినిక్ నందు సచివాలయంలో ఉదయం తొమ్మిది గంటలు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలని, క్లినిక్‌లను శుభ్రం చేయడం, ఓపీ, ఇతర పనులనూ చేయించడతోపాటు పాటు ఉదయ సాయంత్రం రెండుసార్లు రిజిస్టర్ సంతకాలు చేయాలని అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. ఆశాలకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మాచర్ల యుహెచ్‌సిలో చనిపోయిన ఆశ వర్కర్ దీనకుమారి స్థానంలో కోడలు శిరీషను కొనసాగించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆందోళనకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కార్యదర్శులు ఎ.లకీëశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లేశ్వరి, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, నరసరావుపేట పట్టణ అధ్యక్షులు సిలార్ మసూద్, జిల్లా నాయకులు టి.శ్రీను, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సంఘీభావం తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.చంద్రకళ, నాయకులు కె.బుజ్జి, ఎం.రత్నకుమారి, ధనలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










