Dec 26,2022 00:04

మండలంలోని కవ్వాడ గ్రామంలో మామిడి తోటకు మందు పిచికారీ చేస్తున్న రైతు

ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలో ఈ ఎడాది కూడా మామిడి పూత ఆశాజనకంగా కనిపించడంలేదు. మామిడి తోటల వల్ల ఖర్చు తప్ప రాబడి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతునానరు. మండలంలోని పోట్నూరు, రెడ్డిపల్లి, తునివలస, నేరేళ్లవలస, చిన్నపురం, ఐనాడ, బి.తాళ్లవలస, బుడ్డివలస, కోరాడ, వెంకటాపురం, రేవిడి, పాండ్రంగి, మద్ది, పద్మనాభం, అనంతవరం, పెంట, కొవ్వాడ, గంధవరం, బాందేవుపురంలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఎడాది సువర్ణరేఖ రకం మామిడి చెట్లుకు పూత బాగా వచ్చింది. బంగినపల్లి, కలెక్టర్‌, ముంతమామిడి తదితర రకాల మామిడి చెట్లకు పూత సరిగా రావడంలేదని రైతులు చెబుతున్నారు. మండలంలోని కొవ్వాడ, గంధవరం, పెంట, అనంతవరం గ్రామాల్లో రైతులు ఎక్కువగా మామిడి తోటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పూత తక్కువగా రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పూత రావడం కోసం మందులు పిచికారీ చేశారు. వచ్చిన పూతకు మకరం పట్టకుండా ఉండేందుకు కూడా మందులు పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం పొగమంచు లేకపోవడంతో వచ్చిన పూత నిలబడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లుగా మామిడి పూత లేక వ్యాపారులు తమవైపు కన్నెత్తి కూడ చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎకరానికి మందులు పిచికారీకి రూ.30 వేలు వరకు ఖర్చు అయిందని రైతులు చెబుతున్నారు. పూత భాగా రాకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.