Sep 30,2020 07:51

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సిఆర్‌బి) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దినసరి కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. గతంలో దినసరి కూలీల ఆత్మహత్యలను ప్రమాద మరణాలు, ఆత్మహత్యల విభాగంలో లెక్క కట్టేవారు. కరోనా కాలంలో రోజువారీ కూలీలు తాము పని చేస్తున్న స్థలాల నుంచి పిల్లా పాపలను ఎత్తుకుని స్వగ్రామాలకు కాలి నడకన వెళ్లి నిశబ్ద విప్లవం పుట్టించారు. ఇది సమాజంలో అందరినీ కదిలించిన విషయం. బహుశా అందుకేనేమో ఈసారి దినసరి కూలీల ఆత్మహత్యలను ప్రత్యేకంగా బయటపెట్టారు.
2019లో దేశంలో 1,39,123 మంది ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 32,563 మంది రోజు కూలీలు. అంటే 23.4 శాతం మంది. 2014లో ఇది 12 శాతం, 2015లో 17.8 శాతం, 2016లో 19.2 శాతం, 2017- 2018లో 22.4 శాతం, 2019లో 23.4 శాతానికి వరుసగా పెరుగుతూ వస్తున్నది. 2014 నుంచి 2019కి వచ్చేటప్పటికి రెండింతలు అయ్యింది.
ఈ ఆత్మహత్యల పర్వంలో రైతుల ఆత్మహత్యల కంటే రోజుకూలీల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయనేది గమనించాల్సిన కీలక అంశం. 15 సంవత్సరాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పాలక వర్గాలు కానీ, ప్రభుత్వం కానీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం చూపాయి. కార్పొరేట్‌ మీడియా కూడా రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదు. అదే విధంగా రోజు కూలీల ఆత్మహత్యలను సైతం పాలకవర్గాలు పట్టించుకోకుండా గాలికి వదిలేశాయి.
ఆత్మహత్య చేసుకోవడానికి తక్షణ కారణం ఏమైనప్పటికీ సంవత్సర ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్నవారే 2/3 వంతు మంది ఉన్నారు. సంవత్సర ఆదాయం ఐదు లక్షల రూపాయలు ఉన్నవారు 5 శాతం లోపే ఉన్నారు. 1995 నుంచి ఈ లెక్కల సేకరణ జరుగుతున్నది. అయితే నిరుద్యోగులలో ఆత్మహత్యల సంఖ్య ఈ కాలంలోనే రెండంకెలకు చేరుకున్నది. అందులో 10వ తరగతి వరకు చదివినవారు 23.6 శాతం మంది ఉన్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలో సంపదను సృష్టించే లక్షలాది మంది కష్టజీవులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు నిరాశ నిస్పృహలకు నెట్టబడి...ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అనే మానసిక స్థితికి చేరుకోవడం దారుణమైన విషయం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబం, స్నేహితులు మాత్రమే నష్టపోరు. ఇది మొత్తం సమాజానికే నష్టం అనేది గుర్తించాలి. సంపద సృష్టికర్తల పట్ల పాలకవర్గాలు చూపే నిర్లక్ష్యం దీనినిబట్టి అర్థం అవుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ సహజంగానే సంపద సృష్టికర్తలైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులను పట్టించుకోదు. మోడీ ప్రభుత్వం దృష్టిలో సంపదను సృష్టించేది కష్టజీవులు కాదు. కార్పొరేట్‌ శక్తులు, పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలు. పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులు కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుని వారి లాభాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నారు. ఇదే సంక్షోభానికి మూల కారణం. దీనికి మోడీ ప్రభుత్వం పూర్తి అండదండలు ఉన్నాయి. కార్మికులు, కష్టజీవులు సోమరిపోతులనీ, అందుకనే వారి జీతాలు తగ్గంచి, హక్కులు తీసేసి వారికి గుణపాఠం నేర్పాలి అనేది మోడీ సిద్ధాంతం.
ప్రముఖుల ఆత్మహత్యల వార్తలను టీవీలు, పత్రికలు పదే పదే చూపించి ప్రజల దృష్టిని మల్లిస్తున్నాయి. కష్టాలతో వేగలేక కష్టజీవులు చేసుకున్న ఆత్మహత్యలను మాత్రం చూపించడం లేదు. ఆత్మహత్యలకు పురికొల్పే నిరుద్యోగం, ఉద్యోగాలు పోవడం, ఆదాయం లేకపోవడం, దారిద్య్రం, కుటుంబాలను పోషించు కోలేకపోవడం, అప్పు తీర్చుకోలేక పోవడం లాంటి సమస్యలను టీవీలు అసలే చూపించవు. ఇవే జీవన్మరణ సమస్యలు. వీటిని పక్కకు నెట్టి సంస్కరణలను సమాజంపై రుద్దుతున్నారు. తద్వారా కార్పొరేట్‌ సంస్థల, పెట్టుబడిదారుల లాభాలు పెంచేందుకు బాటలు వేస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాలు మనిషికి భరోసా లేకుండా నిస్సహాయులను చేస్తున్నాయి. ట్రేడ్‌ యూనియన్లను లేకుండా చేసి...ఐక్యంగా పోరాడే శక్తినీ నిర్వీర్యం చేస్తున్నాయి.
తాజా లెక్కలను గమనించినా, వలస కూలీలు కాలినడకన రైలు పట్టాలు, రహదారుల వెంట నడుస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయే చిత్రాలను టీవీలలో చూస్తే...లాక్‌డౌన్‌కి ముందే వారు నిర్లక్ష్యానికి గురై ఒక మూలకు నెట్టబడ్డారనేది అర్థమవుతున్నది. అన్ని వైపుల నుంచి వారి జీవితాలను అస్థిరత చుట్టుముట్టేసిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాపిత ఆర్థిక సంక్షోభం కూడా వారి జీవితాలపై తీవ్రమైన ప్రభావం పడేసింది. బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం, లాక్‌డౌన్‌ కష్టాలు వారి జీవితాలను మరింత దారుణంగా మార్చివేసినాయి. జిడిపి 24 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని బట్టబయలు చేసింది. ప్రపంచంలోని పెద్ద దేశాలలో భారత్‌దే దారుణమైన ఉదాహరణ. సంక్షోభం అన్ని వైపులా వ్యాపించిన ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రికి, ఆమె సలహాదారులకు ఆర్థిక వ్యవస్థ చిగురిస్తున్నట్టు కనబడుతున్నది. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? కార్మికులు, కష్టజీవులకు కలలో కూడా చిగురిస్తున్నట్టు కనబడటం లేదు. ఉద్యోగాలు ఊడిపోయి, కార్మిక చట్టాలు కాలరాయబడి, శాశ్వత ఉద్యోగాలు పోయి, పట్టణ, గ్రామీణ ఉపాధి కుంచించుకుపోవడం, జీతాల కోత...లాంటివి కార్మికులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
బిజెపి ప్రభుత్వం కార్మికులకు ఉపశమనం కల్పించే ఆలోచనే చేయటం లేదు. కార్మికులకు, ఇతర కష్టజీవులకు ఆర్థిక సహాయం అందించాలని, ఆహార ధాన్యాలు ఇవ్వాలని ట్రేడ్‌ యూనియన్లు కోరుతున్నా బిజెపి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది.
మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడికి నమ్మిన బంటులా ఉంటూ, నయా ఉదారవాద విధానాలకు కట్టుబడినందున ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. లాక్‌డౌన్‌ కాలంలో దేశ సహజ వనరులను స్వదేశీ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు పళ్లెంలో పెట్టి మరీ అందిస్తున్నది. ప్రజలను దోచుకోవడానికి వీలు కల్పిస్తున్నది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను నిర్వీర్యం చేసి ప్రతిఘటన లేకుండా చేస్తున్నది. ప్రగతిశీల, హేతువాద, నిరసన తెలిపే గొంతులను లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలకు పూనుకుంటున్నది. దీనితోపాటు నిత్య జీవిత సమస్యల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ప్రజల మధ్య మతపరమైన చీలికను తేవడానికి కుట్రలు పన్నుతున్నది. ఇందుకు బిజెపి, దాని మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర అనుబంధ సంఘాలు పూనుకుంటున్నాయి. కుల, మత విభజనను తమ ఆయుధంగా వాడుకుని ప్రజలు ఐక్యం అయి ప్రతిఘటించే అవకాశానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న అధికారంతో అన్ని సంస్థలను, వ్యవస్థలను ప్రభావితం చేసి తన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నాయి.
మోడీ ప్రభుత్వం నిరసన గళాలను తొక్కేయడానికి...అరెస్టులు, తప్పుడు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ...వేలాది మంది రోడ్ల పైకి వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. కార్మికులు, ఉద్యోగులు వారి వారి రంగాలలో తొలగింపులు, జీతాల కోత, కార్మిక చట్టాల సవరణతో పాటు కనీస హక్కులపై జరుగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సమ్మెలకు పూనుకుంటున్నారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా పోరాడుతున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఐక్యంగా అందరికి వర్తించే సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ ఐక్య పోరాటాలను బలపరుచుకుంటూ, ప్రతిఘటన స్థాయికి తీసుకుపోతే అప్పుడు కార్మికులు, ఇతర వర్గాలలో భరోసా ఏర్పడుతుంది. తద్వారా నయా ఉదారవాదాన్ని ఓడించి ప్రజానుకూల, కార్మిక అనుకూల విధానాలు సాధించవచ్చనే నమ్మకం ఏర్పడుతుంది. అన్ని రంగాల ప్రజల మధ్య ఐక్యత, సంఘీభావం వలన కష్ట జీవులలో ఉన్న నిస్పృహ తొలగిపోయి, పోరాటాలకు పూనుకోవాలనే నమ్మకం బలపడుతుంది. పాలక వర్గాల ఆధ్వర్యంలో జరుగుతున్న ముప్పేట దాడిని ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గం. అందుకే నిరాశకు లోనుకావొద్దు! ప్రాణాలు తీసుకోవొద్దు! అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుదాం. మన బతుకులను మార్చుకునేందుకు పోరాడి గెలుద్దాం.
( వ్యాసకర్త సిఐటియు జాతీయ అధ్యక్షురాలు )