Nov 06,2022 22:21

పెదవివిరిచిన నిరుద్యోగులు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

              వైసిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాబ్‌మేళా నిరుద్యోగులకు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. వేతనం ప్యాకేజీ, ఉద్యోగాలు కల్పించే ప్రాంతాలు సుదూరంగా ఉండటంతో నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాపై పెదవిరిచారు. ఏలూరు నగరానికి సమీపంలోని పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ పరిధిలో ఉన్న రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ప్రారంభించిన మెగాజాబ్‌మేళాకు ఊహించిన స్పందన కరువైంది. ఈ జాబ్‌మేళా వాయిదా పడిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడం వల్లే ఆశించిన మేర నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేళాకు సుమారు నాలుగు వేల మంది వరకూ హాజరవుతారని ఊహించారు. కానీ దాదాపుగా 500 మంది వరకే హాజరయ్యారు. వారు కూడా నిరాశగా వెనుదిరగడం కనిపించింది. హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చూపిస్తున్నారని, వాటికి వెళ్దామన్నా వేతనం రూ.12 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని నిర్వాహకులు చెబుతున్నారని, అదే విజయవాడ అయితే రూ.10 వేలు వేతనం ఇస్తామని చెబుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోయారు. వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా తమకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని, ఫోన్‌ నంబరు, వివరాలు తీసుకుని పంపించివేస్తున్నారని పలువురు నిరుద్యోగ అభ్యర్థులు వాపోయారు.
జాబ్‌మేళానా? ఫుడ్‌మేళానా?
ఈ మేళాకు హాజరైన వారిలో చాలామందికి ఇది జాబ్‌మేళానా? లేక ఫుడ్‌మేళానా అనే సందేహం కలిగింది. ఇక్కడ జాబ్‌మేళాకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక బోర్డు ఉంటే పదిబోర్డులు మాత్రం వివిధ ఆహార పదార్థాలకు సంబంధించినవి కనిపించాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న క్యాంటిన్‌లో కూడా ఆదివారం ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు తినుబండారాలను, తాగునీటి బాటిళ్లను విక్రయించారని పలువురు వాపోయారు. అదేమని అడిగితే ఈ ఒక్కరోజే కదా? బయట నుంచి వచ్చేది అందుకే అధిక ధరలకు విక్రయిస్తున్నామని సిబ్బంది తెలపడం కొసమెరుపు. మరోవైపు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, వైసిపి నాయకుల హడావుడే అధికంగా కనిపించింది.