Jun 17,2023 00:41

ప్రజాశక్తి - గుంంటూరు జిల్లాప్రతినిధి : నైరుతీ రుతుపవనాలు ముఖం చాటేయడంతో గుంటూరు, పల్నాడులో సూరిడు నిప్పులు చెరుగుతున్నాడు. వడగాల్పులు మరింత పెరిగాయి. వేసవి తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో 17 మండలాలు, పల్నాడు జిల్లాలోని 24 మండలాల్లో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా పరిధిలో 13 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా నాలుగు మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రహదారులపై ప్రయాణం చేయాలంటే నరకయాతనగా ఉందని ప్రజలు వాపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు తీవ్రమైన వడగాల్పులు వీచాయి. ఏటా జూన్‌ రెండో వారం కన్నా నైరుతీ రుతుపవనాలు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించేవి. ఇప్పటికే అడపాదడపా వర్షాలుపడేవి. వాతావరణం చల్లబడేది. కానీ ఈఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జూన్‌ మూడో వారంలోకి ప్రవేశించినా ఇంతవరకు రుతుపవనాల జాడలేదు. ఏప్రిల్‌ 29 నుంచి మే 9వ తేదీ వరకు అకాలవర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ వర్షాలు కురవలేదు. ప్రధానంగా 15 రోజులుగా వర్షాల జాడలేకపోగా ఎండల తీవ్రత పెరిగింది. ఎండల తాకిడికి ప్రజలు పగటి సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడానికి హడలెత్తిపోతున్నారు. బయటకు వెళ్లిన వారు వడగాల్పుల భారీన పడి ఇళ్లకు చేరేసరికి డీలాపడుతున్నారు. కొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్మెట్‌, ముఖానికి ఖర్చీఫ్‌, టోపీ ధరిస్తున్నారు. చెవులకు, తలకు వస్త్రాలు కట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. గతేడాది జూన్‌ రెండోవారంలో వేసవి తీక్రత కొంత వరకు తగ్గిందని, ఈ ఏడాది రుతుపవనాలు రాకపోవడంతో మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీధుల్లో పగటి పూట జనసంచారం తగ్గింది. వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేడిగాలుల తీవ్రతకు వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్నారు. వేడి తీవ్రతకు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏసీలు, కూలర్లు వినియోగించే వారు కొంత మేరకు వేడి తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నా మిగతా వారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి సేద తీరేందుకు కనీస నీడ కరువైంది. గుంటూరుతో పాటు ప్రదాన పట్టణాల్లో నిలబడేందుకు కనీసం చెట్లు కూడా లేకుండాపోయాయి. రహదారుల విస్తరణ, బ్యూటిఫికేషన్‌ పేరుతో భారీ చెట్లను తొలగించడం వల్ల వేసవి తీవ్రతకు నీడలేక ప్రజలు ఇబ్బందులు వర్ణనా తీతంగాఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల తరువాత బయటకు వచ్చిన ప్రజలు ఐస్‌ క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌, మజ్జిగ ప్యాకెట్లు, కొబ్బరిబొండాలకు ఆసక్తి చూపుతున్నారు.
మరో మూడు రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని సోమవారం తరువాత వాతావరణంలో మార్పు రావచ్చునని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 19వ తేదీ తరువాత నైరుతీ రుతుపవనాలు క్రమంగా బలపడవచ్చునని చెబుతున్నారు. వేసవి తీవ్రతతో మళ్లీ విద్యుత్‌ వినియోగం పెరగడం, విద్యుత్‌ పరికరాలు దెబ్బతిని పలు మార్లు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కల్గుతోందని అధికార వర్గాలు తెలిపాయి.