ప్రజాశక్తి - మండవల్లి
భానుడు ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. గత పదిరోజులుగా సూర్యుడు నిప్పులు చెరగడంతో బయటకు రావాలంటనే వణికిపోతున్నారు. వడగాల్పులు, ఉక్కపొతతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు విద్యుత్ పరికరాలను, ఆరుబయట చెట్లను ఆశ్రయిస్తున్నారు. మండలంలో సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మధ్యాహ్నం రోడ్లపై వాహనాల రాకపోకలతో పాటు జనసంచారం పూర్తిగా స్తంభించింది. జాతీయ రహదారి, మండవల్లి ప్రధాన సెంటర్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో మబ్బులు పట్టి చిన్నచిన్న చినుకులతో పాటు చల్లని గాలు వీయడంతో కొంత చల్లదనం వచ్చినప్పటికీ పగటిపూట సూర్యుడు నిప్పులు చెరగడంతో సాయంత్రం ఆరు గంటల వరకూ వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు విద్యుత్‌ను మితిమీరి వాడడంతో విద్యుత్ వైర్లలో సామర్థ్యం తగ్గిపోయి తెగిపడిపోతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు లో ఓల్టేజీ సమస్య ప్రజలను ఇబ్బందిపెడుతుంది. కరెంట్ ఉన్నప్పటికీ ఫ్యాన్లు సరిగా తిరగకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిసి వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వడగాల్పులతో విలవిల
ముదినేపల్లి : మండల ప్రజలు తీవ్ర వడగాల్పులు, ఎండలతో విలవిల్లాడుతున్నారు. రోహిణి కార్తె ముగిసినా ఎండలు, వడగాల్పులు మాత్రం తగ్గడంలేదు. మండలంలో ఆదివారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముదినేపల్లితో పాటు ముఖ్యవ్యాపార కూడళ్లు సింగరాయపాలెం, శ్రీహరిపురం, అల్లూరు, గురజ తదితర సెంటర్లల్లో వ్యాపార సంస్థలను 12 గంటలకు మూసివేసి తిరిగి సాయంత్రం ఐదు గంటల తర్వాత తెరుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. ప్రజలు వేసవి తాపానికి కూలర్లు, ఎసిలు వినియో గిస్తుండగా. పశుపోషకులు మాత్రం ఎండల తీవ్రత నుంచి పశువులను కాపాడుకునేందుకు గ్రామ ఊర చెరువుల్లో దించి రక్షణ చర్యలు తీసుకుం టున్నారు. అంతేకాక పశువుల పాకల్లో గాలి పంకాలు ఏర్పాటు చేసి పశువులను ఎండల భారినుంచి కాపాడుకునే చర్యలు తీసుకుంటున్నారు.










