
నిప్పుల కొలిమి...
-మండుతున్న ఎండలు
- ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
- పగలంతా చెట్ల కిందే కాలయాపన
ప్రజాశక్తి - కొత్తపల్లి
ఈ ఏడాది మే నెలలో నిప్పుల కొలిమిలా ఎండలు మండుతున్నాయి. ఎండలు భగభగమంటుండడంతో పాటు గాలి లేకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ కూడా సక్రమంగా లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లె ప్రాంతాల్లో పగలంతా ప్రజలు చెట్ల కింద కాలయాపన చేస్తూ గడుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ప్రజలంతా సమీపంలో ఉన్న వ్యవసాయ బావులు, చెరువులను ఆశ్రయించి సరదాగా ఈత కొడుతూ ఉపశమనం పొందేవారు. అయితే ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండడం, ఉదయం 10 గంటలు దాటితే సాయంత్రం 6 గంటల దాకా ఎండవేడి ఒకవైపు, మరోవైపు ఉక్క పోత ఉండడంతో ప్రజలంతా పెద్ద పెద్ద చెట్లు, నీడ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటూ సేద తీరుతున్నారు. ఈ ఏడాది 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఎండలు నమోదు కావడంతో ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రజలు ఎండల భారీ నుండి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలు తమ పనులను ఉదయం 10 గంటల లోపల ముగించుకొని మధ్యాహ్నం అంతా చల్లటి నీడ ఉన్న ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 6 గంటలకు పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వైద్యాధికారులు పలు సందర్భాల్లో తెలియజేస్తున్నారు. మండుతున్న ఎండలు ఒకవైపు ఉంటే మరోవైపు పల్లె ప్రాంతంలో సమయ వేళలు లేకుండా విద్యుత్ కోతలు ఉండడంతో ప్రజలు ఉక్క పోతకు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగే గ్రామాల్లో పెద్ద పెద్ద చెట్ల కింద ప్రజలు కూర్చుని సమయం గడుపుతున్నారు. రహదారులు మాత్రం నిర్మానుషంగా మారుతున్నాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత గ్రామాల్లో ఉన్న రోడ్లు ప్రజలతో నిండిపోతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైద్యాధికారి వినోద్ కుమార్
గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పనులు ఉంటే ఉదయం 10 గంటలలోపు ముగించుకొని ఇళ్లలోనే ఉండాలి. మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి బయటకు వచ్చి పనులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎవరు బయటకు రావద్దని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల ద్వారా పలు సూచనలు కూడా గ్రామాల్లో తెలుపుతున్నాం. ఎక్కువగా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, నీటిని తీసుకోవాలి.
బయటికి రావాలంటే భయమేస్తుంది
బొల్లు ప్రసాద్ బాబు యాదవ్, గుమ్మడాపురం.
ప్రస్తుతం ఉంటున్న ఎండలను ఎన్నడూ చూడలేదు. ఇంటి నుండి పనుల నిమిత్తం బయటికి రావాలంటే భయమేస్తుంది. ప్రతిరోజు అవసరాల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో వెళ్తున్న ప్రజలకు వడదెబ్బ సోకే అవకాశం ఉంది. మరోవైపు విద్యుత్ కోతలు అధికంగా ఉండడంతో ప్రజలకు ఉక్కపోత కష్టాలు భారీగా ఉన్నాయి.










