నిప్పుల కొలిమి...
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
మార్చి చివరి వారం నుంచి భానుడు భగభగలాడుతూ ఎండ వేడిమిని పెంచుతున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత అధికమై నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల మొదటి వారంలో నంద్యాల, చాగలమర్రి, ఆళ్లగడ్డలో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆత్మకూరులో 36, డోన్ 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 26 నాటికి ఆ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు అధికంగా నమోదైంది. నంద్యాల, చాగలమర్రి, ఆళ్లగడ్డలో 41 డిగ్రీలను తాకింది. ఆత్మకూరులో 40 డిగ్రీలు, డోన్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం మరింత వేడి పెరగడంతో అత్యధికంగా ఆళ్లగడ్డలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యం, నంద్యాలలో 44, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరులో 43, డోన్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెలాఖరు వరకు ఎలాంటి ఎండలు ఉంటాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కొనసాగుతున్న యువగళం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. తొలుత డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో ముగిసింది. ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. అడుగడుగునా పలు వర్గాలు, గ్రామస్తులు, పలు సంఘాల ప్రతినిధులు లోకేషను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
నంద్యాల టిడిపిలో విభేదాలు
నంద్యాల జిల్లా టిడిపిలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎపి విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య గతం నుండే విభేదాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో అవి బయటపడ్డాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మంగళవారం మరోసారి ఆ రెండు గ్రూపుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
eevara strip










