ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
కర్నూలు జిల్లాలో ఎండ మండుతోంది. భానుడి భగభగలు తీవ్రమవడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గతేడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు...
మార్చి చివరి వారానికి భానుడు భగభగలాడుతూ ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారిపోయాడు. జిల్లాలో వేసవి తీవ్రత తీవ్రంగా పెరిగింది. గత వారం రోజుల నుంచి ఎండ ఉగ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలో కర్నూలు నగరంలో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో 36 డిగ్రీలు, ఆలూరులో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మార్చి 26 నాటికి కర్నూలు, ఓర్వకల్లులో అధికంగా 39 డిగ్రీలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది అమాంతం పెరగడంతో మంగళవారం జిల్లాలో ఆలూరులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలులో 42 డిగ్రీలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయంలో 41 డిగ్రీలు, ఆదోని, పత్తికొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండ వేడిమితో మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా ఎండ తీవ్రత కనిపిస్తోంది. మే నెలాఖరు వరకు ఎండలు ఎంత భయంకరంగా ఉంటాయోనని జిల్లా వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జన సంచారం పలుచబడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్ల మీద జనం చాలా తక్కువగా కనిపించారు. అత్యవసర పనుల విషయంలో మినహాయించి మిగతా సందర్భాల్లో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం జంకే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు నగరంలోని రాజ్ విహార్ కూడలి, కలెక్టరేట్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ ప్రాంతం, కొండారెడ్డి బురుజు ప్రాంతాలు మధ్యాహ్నం పూట నిర్మానుష్యంగా కనిపించాయి. అవసరమై రోడ్ల మీద తిరిగేవారు ఎక్కువగా చెట్ల నీడను ఆశ్రయిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు బయట తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ వంటివి తగలకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకూ నీడలో ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదని, చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవాలని పేర్కొంటున్నారు. బయట తిరిగే సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునేందుకు పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలని, వదులైన కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.
మరింత పెరగనున్న వేడి
బుధవారం నుంచి జిల్లాలో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగళవారం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
మంగళవారం ఉష్ణోగ్రతలు ఇలా..
ఆలూరు 43
కర్నూలు 42
కోడుమూరు 41
ఎమ్మిగనూరు 41
మంత్రాలయం 41
ఆదోని 40
పత్తికొండ 40
నిప్పుల కొలిమి










