Jun 07,2021 09:26

రెక్కలు కష్టాన్ని నమ్ముకొని
రేపటి వెలుగు కోసం బతుకుతున్న
బడుగు జీవుల భరతావనికి
ఇప్పుడు అన్నంతో పాటు ఆక్సిజన్‌ కూడా కరువై సంతలో సరుకై
శ్వాసను కబళిస్తున్నది
ఏడు పదులు దాటిన స్వతంత్రంలో
ఎంతగా ఎదిగిపోయాము !

పంచభూతాలను కూడా బంధించి
సంపదను వశము చేసుకుంటున్న స్వార్థపరులు
గోస పడుతున్న జనం పట్ల జ్యాస మరిసి
గుండెకాయలాంటి దండకారుణ్య సిరుల
గుట్టు చప్పుడు కాకుండా కొట్టేయాలని చూసే కొంటెపనుల్లో ఆరితేరిన
అపర దేశభక్తులున్న నేల కదా!

స్కాముల్లో గడ్డివాముల్లో
కోట్లు గడించిన వంచకులు
ఈ దేశపు శ్రమ సౌందర్యపు మూలాలను
చితి మంటల్లోకి విసిరి
చలి కాచుకుంటున్న నీచత్వం నీడలో
పడకేసిన ప్రజాస్వామ్యపు ఆకాంక్షలు
ఎట్లా మొలకెత్తుతాయి!

తాకట్టు పడ్డ తలలతో
కాసులున్న దేశాల ముందు దాసోహమయ్యే
బానిసత్వానికి ఇంకా మెరుగులు దిద్దుతూ
దేశం మెరిసిపోతుందంటు మురిసిపోతున్న దృతరాష్ట్రులను ఏమనాలి?

స్వేదం పిండుకొని మోదంతో బతికేస్తున్న
జల్సా జలగలు
సామాన్యులే సమిధలుగా
చావు డప్పులే సంగీతమై
శ్మశానాలను హోరెత్తిస్తుంటే
మొద్దు నిద్ర నటిస్తున్నరు

కుళ్ళును కడుగెయ్యడానికి కళ్ళు తెరువనివ్వని కుట్రల పర్వాలు ఆశ్వాసాలుగా అల్లబడుతున్నను
ఒళ్ళు మరిచి నిదురోతున్న సోమరితనానికి
చెల్లించుకుంటున్న మూల్యమని
ఇంకా అర్థమైతే కదా

నిప్పుల కొలిమిలా రగులుతున్న
అగ్నిపర్వతాలు ఉప్పెనలా ఎగసే దాకా
ఈ ఉన్మాదాలను భరించాల్సిందేనా?
 

- గన్‌ రెడ్డి ఆదిరెడ్డి
94947 89731