Nov 21,2021 07:27

అక్కా! కులపెద్దల పంచాయితీ అన్నావు కదా! అయిపోయిందా?'
'ఆ.. అయిపోయింది. అయిపోయిందంటే పూర్తిగా అవలేదు. వాళ్ళు చెప్పాల్సింది.. కాదు కాదు.. వాళ్లు చెప్పాలనుకున్నది. అదీ కాదు.. వీళ్లు చెప్పమన్నట్లు చెప్పేసి, ఇక తాగడం.. తినడంలో పడ్డారు'.
'ఓహో! మరి ఏం తీర్పు చెప్పారు?'
'తీర్పు అంటారా దాన్ని? అంతా ఏకపక్ష నిర్ణయమే'.
'అదేంటి? నీ అభిప్రాయం అడగనే లేదా?'
'సునీతా! వీళ్లు నిరక్షరాస్యులేగానీ తెలివిలేనివాళ్ళు మాత్రం కాదు'.
'ఆచారం అనే ముసుగులో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోగల నేర్పరులు'.
'నువ్వేమీ మాట్లాడలేదా?'
'నా మాటలు వీళ్లు వింటారా? భర్త పోయి, ఇద్దరు పసిగుడ్లతో నడిరోడ్డు మీద నిలబడ్డ నిస్సహాయురాల్ని కదా!'
'అక్కా ప్లీజ్‌..!'
'ఏడవకూడదనే అనుకుంటాను. కానీ కావటం లేదు. అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు'
'అనూహ్యమైనదే కదా జీవితమంటే!'
'అవును. ప్రేమించి, పెళ్లాడిన రాము నన్నిలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోతాడని అనుకున్నానా?'. రాము తన ప్రేమను తెలిపినరోజు 'సంతోషంతో నీ కళ్ళల్లో నీళ్ళు వస్తే ఫర్వాలేదుగానీ కన్నీళ్లు మాత్రం రానివ్వకుండా నిన్ను చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అన్న మాటలు గుర్తొచ్చాయి.
****
తామిద్దరూ ఇంటర్‌, డిగ్రీ కలిసి చదివారు. ఎప్పుడూ తనతో మాట్లాడిందే లేదు. కనీసం తనవైపు చూస్తున్నట్లు కూడా గమనించలేదు. డిగ్రీ అయిపోయింది. ఫేర్వెల్‌ ఫంక్షన్‌రోజు అందరూ భారమైన మనసులతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని, బయలుదేరుతుండగా రాము తన దగ్గరకు వచ్చాడు.
'ఒక్క నిమిషం ప్లీజ్‌' పక్కకు రమ్మన్నట్లుగా చూశాడు. రాగానే చేతిలో కవర్‌ పెడుతూ..
'ఏమిటిది?' అప్రయత్నంగా అందుకుంటూనే ఆశ్చర్యంగా చూసింది. ఐదేళ్ళ తర్వాత ప్రేమలేఖ ఇస్తున్నాడా? అన్న ఆలోచన! తనను చూసిన మొదటి క్షణంలోనే ఆమెపై ప్రేమ ప్రారంభమైందన్నాడు రాము.
'కులం, ఆస్తి, అంతస్తు కాదని నీ చెయ్యి అందుకోవాలంటే, నా కాళ్ళ మీద నేను నిలబడడమే అర్హత అని భావించి, రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాణ్ణి. కాబట్టే డిగ్రీ అయ్యాక చేరవలసిన ఉద్యోగం అపాయింట్మెంట్‌ లెటరు నీ చేతుల్లో పెట్టాను. అదే ప్రేమలేఖని నా భావన. నా ప్రేమ పరీక్షలో విజేతనో.. కాదో తేల్చాల్సింది నువ్వే'. చక్కని చిరునవ్వుతో, హుందాగా చెప్పాడు రాము.
ఇప్పటివరకూ ఎన్నో ప్రపోజల్స్‌ వచ్చాయి. వాటినన్నింటినీ తీసేసినంత తేలిగ్గా రాము ప్రేమను తోసిపుచ్చలేకపోయింది. అతను తన చేతికి ఇచ్చింది వయస్సుకు, ఆకర్షణకు, మోహానికి లోనైన ప్రేమలేఖ కాదు. 'నా ప్రేమ నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటుంది' అన్న భరోసానిచ్చే అపాయింట్మెంట్‌ లెటర్‌. ధైర్యం ఇచ్చే ఆత్మవిశ్వాసం. ఎంత ఆలోచించినా అతన్ని కాదనడానికి కారణం కనిపించలేదు. అయితే ఇంట్లో చెప్పి, ఒప్పించే దారీ కనిపించలేదు.
అమ్మానాన్నలకు తనొక్కతే కూతురు. అయితే తమది ఉమ్మడి కుటుంబం. అమ్మా, నాన్న, ఇద్దరు బాబాయిలు, వాళ్ల భార్యాపిల్లలు.. అందరూ కలిసే ఉంటున్నారు. పెద్ద బాబాయికి ఇద్దరు కొడుకులు. చిన్న బాబాయికి కూతురు, కొడుకు. తన తర్వాత అమ్మకు కొన్ని కారణాల వల్ల గర్భసంచి తీసేశారు.
నాన్నమ్మకు కులపిచ్చి అనటం కన్నా అభిమానం ఎక్కువ అని చెప్పవచ్చు. చిన్న బాబాయి కాలేజీలో ఎవరినో ప్రేమించాడని తెలిసి, చదివే మాన్పించేసి, నాన్నతో పాటు వ్యాపారంలో పెట్టేసిందట. ఇంట్లో నాన్నమ్మ మాటే వేదం అనే కన్నా శాసనం అంటే సరిగ్గా ఉంటుంది. ఆమె చాలా తెలివైనది కావడమే అందుకు కారణం. వ్యాపారం అభివృద్ధి చెందటంలోనూ ముఖ్యమైన సలహాలు, సూచనలు, నిర్ణయాలు చాలామటుకు ఆమెవే!
కుటుంబాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆమె దిట్ట. కోడళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని ఆదిలోనే తుంచేసి, అందరూ కలిసి ఉండేలా చూసేది. అమ్మానాన్నలకు తనమీద ఎంత ప్రేమ ఉన్నా నాన్నమ్మ మాట కాదనలేరు. నాన్నమ్మ రామూను తమ ఇంటి అల్లుడిగా కలలోనూ అంగీకరించదు. మరి ఎలా? తను చాలా దిగులు పడిపోయింది. ఇంటికి పెద్ద కూతురు తను. డిగ్రీ అయిపోయింది. ఇక పెళ్లి చేయాలని సంబంధాలు చూసే పనిలో పడ్డారు నాన్నమ్మవాళ్లు. ఇంకా తను రాము గురించి చెప్పకుండా ఉంటే ఎలా? అని తను చాలా మధన పడిపోయింది.
బాబారు కూతురు సునీత, తను చాలా క్లోజ్‌గా ఉండేవారు చిన్నప్పట్నుంచి. 'ఏమిటక్కా! నాకూ చెప్పని రహస్యమా?' అడిగిందో రోజు.
ఆ రోజు రాత్రి భోజనాలు చేసేటప్పుడు నాన్నమ్మ చెప్పింది. 'నూజివీడు సంబంధం అన్నివిధాలా సరిపోయేదిగా ఉంది. అబ్బాయి త్వరలో అమెరికా వెళతాడట ఉద్యోగానికి. ఈ లోపు సంబంధం చూసి, పెళ్లి చేసి పంపాలని అతని అమ్మానాన్నల అభిప్రాయం అట. నేను అంతా వాకబు చేయించాను. మంచి సంబంధం. పెద్దపాప సుఖపడుతుంది. మంచిరోజు చూసి, వాళ్లను పెళ్లి చూపులకు రమ్మందామనుకుంటున్నాను. మీరేమంటారు?' నాన్నమ్మ మాటలకు నాన్న, బాబాయిలు సరే అనక ఇంకేమంటారు? ఆమె వ్యవహార దక్షత వాళ్లకు తెలియకపోతే కదా!
వాళ్లకు తెలియనిది తన ప్రేమ సంగతి. తనకు టెన్షన్‌ పెరిగిపోయింది. తన మాట వినేదటుంచి, చెప్పటానికి తనకే పెదవి పెగలలేదు. అటు రాము ప్రేమను కాదనుకోలేదు. ఇటు ఇంట్లోవాళ్ళకు చెప్పనూలేదు. 'ఏం చేయాలో తోచడం లేదే?' అంటూ సునీతను పట్టుకుని, బావురుమంది.
సునీత తనను ఓదార్చలేదు. తను ఏడ్చినంతసేపూ.. తీవ్రంగా ఆలోచించి.. కళ్లుతుడుచుకుంటూంటే చెప్పింది. 'నీకు అతని ప్రేమపైన నమ్మకం ఉంటే ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకోవటం ఒక్కటే మార్గం. లేదు.. ధైర్యం లేదూ.. అంటే ఇంట్లో చూసిన సంబంధం చేసుకోవడం కంటే మరో గత్యంతరం లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమను అంగీకరించి, నీకు పెళ్లి చేసేంత విశాల హృదయం మన ఇంట్లో ఒక్కరికీ లేదు. నాన్నమ్మ సంగతి మనకు తెల్సిందే కదా! ఒకవేళ చెప్పినా గొడవలు, బలవంతపు పెళ్లి తప్ప ఒరిగేదేమీ లేదు..' అంది. సునీత నాన్నమ్మలాగా తెలివైనదని పేరు. కుటుంబంలో ఒకింత ధైర్యం, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవటం ఆమె నైజం.
సునీత మాటలకు తను ఆశ్చర్యపోయింది ముందు. తర్వాత ఎంత ఆలోచించినా మరోదారి కనిపించలేదు. తనకోసం వెతకవద్దని, తను మేజర్‌ కనుక ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకునే హక్కు తనకు ఉందని, దయచేసి అర్థం చేసుకుని, ఆశీర్వదించాలని ఒక ఉత్తరం రాసి పెట్టి, కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్లిపోయాను. ఆ రోజు నుండి సునీతతో తప్ప, ఆ ఇంటి మనుషులతో తనకు సంబంధం తెగిపోయింది.
పెళ్ళికి రాము వైపు అభ్యంతరాలు లేకపోయినా, తన వాళ్ళు లేరని తాను బాధపడకూడదని, రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని, తాళి కట్టాడు.
'నాతిచరామి' ఆ రాత్రి .. తమ తొలిరాత్రి.. తనతో రాము మాట్లాడిన తొలిమాట.
'ధర్మేచ, అర్థేచ, కామేచ, త్వయేచ నాతి చరితవ్యా అంటే.. ధర్మంలో, ధనంలో, కోరికలో నిన్ను అతిక్రమించి నడుచుకోను అనీ బాస చేస్తున్నాను' అన్నాడు.
తను ఆశ్చర్యపోయింది. పెళ్ళి తంతులో పురోహితుడు చదివే మంత్రాలకు 'మమ' అనడం, 'నాతిచరామి' అనడమే తప్ప, ఎంతమంది వరులకు అర్థాలు తెలుసు? తెలిసినా ఆచరిస్తున్నవారు వారు ఎంతమంది ఉండి ఉంటారు. అలాంటి వారిలో ఒకడు రాము అనుకుంది. అప్పటి నుంచి తన ప్రాణమై పోయాడు. నిజానికి తనకా క్షణంలోనే అతని మీద ప్రేమ మొదలైందేమో!
****
'అక్కా.. అక్కా.. మాట్లాడూ.. ప్లీజ్‌ ..' ఫోన్‌లో సునీత గొంతు గోల పెట్టేస్తోంది.
'ఆ..! సునీతా! రాము నాకు ఇంత అన్యాయం చేస్తాడని ఉహు.. కాదు కాదు.. రాము చాలా మంచివాడు. ఎవర్నీ నొప్పించే స్వభావం కానేకాదు. మా ఆనందం చూడలేక ఆ దేవుడే మాకు అన్యాయం చేశాడు. ఇప్పుడు వీళ్ళు'.
'అక్కా! కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి కదూ?'
'నిజమే! కానీ నాకు కష్టం అంటే ఏమిటో ఇన్నేళ్లూ తెలియనే తెలీదు. పుట్టింట్లో మనం ఏ లోటూ తెలీకుండా గారాబంగా పెరిగాము. పెళ్లయ్యాక అందర్నీ మరిపించే అనురాగం చూపిన రాము హఠాత్తుగా ఇలా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓదార్పుగా ఉండాల్సిన పుట్టింటి వారెవరూ పట్టించుకోలేదు. వాళ్ళకింకా నా మీద కోపం పోనేలేదు కదా? అండగా నిలబడాల్సిన అత్తింటివారు ఆచారాల పేరిట వేధిస్తున్నారు'.
'అక్కా! ఇంతకీ ఏమంటున్నారు?'
'వాళ్ల ఆచారం ప్రకారం రాము తమ్ముణ్ణి పెళ్ళాడమంటున్నారు'.
'ఆ ..?!'
'ఆ.. అవును. నేనూ నీలాగే ఆశ్చర్యపోయాను. కంపరంగా అనిపించింది. అన్యాయం అన్నాను. రాము ఆత్మ శాంతిస్తుందట. ఎందుకంటే.. ఎందుకంటే..?'
'చెప్పక్కా!'
'నేను, పిల్లలు సుఖంగా ఇంటిపట్టున ఉంటామట. కానీ అసలు విషయం వేరే ఉంది'.
'ఏమిటది?'
'రాము తమ్ముడు నన్ను పెళ్లి చేసుకోవడం లీగల్‌ కాదు. కంపాసినేషన్‌ కేటగిరిలో రాము ఉద్యోగం అతనికి రావడానికి నేను అడ్డుపడకుండా ఉండడానికి మాత్రమే. నిజానికి అతనికి మేనత్త కూతురితో పెళ్ళి ఎప్పుడో నిశ్చయం అయ్యే ఉంది. అది నాకు తెలుసు. ఉద్యోగం వచ్చాక, ఆ పెళ్ళి జరుగుతుంది లీగల్‌గా'.
'అక్కా! ఏం మాట్లాడుతున్నావూ?'
'అవును సునీ! ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. రాము ఉన్నప్పుడు నన్ను పల్లెత్తు మాట అనే సాహసం లేదు. ఇప్పుడు అసలు నన్ను లెక్కే చేయడం లేదు'.
'బావ పోయి పదిరోజులు కాలేదు. ఇదంతా ఎలా మాట్లాడగలుగుతున్నారు?'
'హు! వాళ్ళ ఆచారాలంటారు. రేపు పదకొండో రోజు దినకర్మ. అప్పుడే ఇదంతా బంధుజనం ముందే జరగాలట!'.
'అయ్యో! ఎంత దారుణం? నీ అంగీకారం లేకుండా..'
'నా తరఫున అడిగేవాళ్లు ఎవరూ లేరన్న ధైర్యం కావచ్చు'.
'అక్కా! రేపు నేను, మా ఆయన వస్తాము.'
'మళ్లీ ఇంకో ఆచారం అన్నారు కదా. వాళ్ళ కులపోళ్లు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాకూడదని'.
'అక్కా....'
'అవును సునీ! రామూకు ఆక్సిడెంట్‌ అయినపుడు ఆస్పత్రిలో చూసుకొని, బాడీని ఇంత దూరం తీసుకొచ్చీ.. అంత్యక్రియలన్నింటికీ ఎంతో డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టిన అతని స్నేహితులకు, కొలీగ్స్‌కు ఎవరికీ రేపటి దినకర్మకు పిలుపులేదు. నాకేం దిక్కుతోచడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. రాము తన సంపాదనంతా కుటుంబానికే ఖర్చు పెట్టాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ల చదువులు, నా పురుళ్ళు, పిల్లల ఖర్చులు.. అసలు జీతం సరిపోయేది కాదు. నేను ఎంతో సర్దుకుని, గుట్టుగా సంసారం నడిపాను.
'ప్రేమ అంటూ నీ వెంటపడి, నీకు సుఖం లేకుండా చేశాను' అని రాము బాధపడుతుంటే నేనే ఓదార్చే దాన్ని'. 'బాధ్యతలు తీరాక బోలెడు బంగారం కొంటా' అనేవాడు.
'మెడలో చైను తప్ప నగలేమీ లేవని నేను ఎప్పుడూ బాధపడలేదు. బంగారం కన్నా విలువైన అతని అనురాగమే చాలు అనుకున్నాను. ఇద్దరు పసిబిడ్డలతో ఇప్పుడు నేను.. ఈ మూర్ఖుల మధ్య చిక్కడిపోయాను'.
'అక్కా! ప్లీజ్‌.. మూర్ఖులైనా.. స్వార్థపరులైనా... నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ముందు బావ దినకర్మ జరగని. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు...' సునీత చెప్పేది శ్రద్ధగా వింటోంది.
***
ఏ మాత్రం గొడవ చేయకుండా.. ఒక్కమాటా ఎదురు చెప్పకుండా తాము చెప్పినట్లు అన్ని క్రతువులూ చేస్తూ.. చేయించుకొంటున్న మైథిలీ వైఖరి అందరికీ ఒకింత ఆశ్చర్యంగా, ఆనందంగానూ ఉంది.
చాలా గంభీరంగా వున్న వదిన.. తుఫాను ముందరి ప్రశాంతంలా అన్పించింది పెద్దమరిదికి. మరదులిద్దరూ అన్న ఇంట్లో ఉండి చదువుకొన్నవారే! వదిన ఆప్యాయతానురాగాలు చవి చూసినవారే! అయినా స్వార్థం ముందు మంచితనం, మానవత్వం లెక్కకు రానిదే! కృతజ్ఞత గుర్తుకు లేనిదే!
అన్ని క్రతువులూ సజావుగా సాగిపోయాయి. చివరిఘట్టం! అంతవరకూ ఇంటికి పెద్దదిక్కుగా, ఆలంబనగా, ఆసరాగా ఉన్న రాము స్థానాన్ని అతని పెద్దతమ్ముడు తీసుకోవాలి. అందుకు అతను చేయవల్సిన మొదటిపని.. అన్న భార్యను తన భార్యగా అంగీకరిస్తూ.. అన్న ఫోటోకు ఉన్న పూలదండను వదిన మెడలో వేయాలి. అంతే! పెళ్ళయిపోయినట్లే! అందరూ ఉత్కంఠగా, సంతోషంగా చూస్తున్నారు.
పెద్దల సూచన మేరకు అతను అన్న ఫోటోపై నుండి పూలదండ తీసుకొని, మైథిలీ దగ్గరగా వచ్చాడు. తీవ్రంగా, సూటిగా చూస్తున్న వదిన కళ్ళల్లోకి చూసే ధైర్యంలేక చూపులు దించుకొన్నాడతడు. పూలదండను పట్టుకొన్న అతని చేతివేళ్ళు వణకటం స్పష్టంగా తెలుస్తోంది.
అతని చేతిలోని పూలదండ తీసుకొని, తిరిగి రాము ఫోటోకి వేస్తూ 'మీరంతా నన్ను క్షమించాలి. నేను మీ ఆచారాన్ని ఒప్పుకోవటం లేదు. నా జీవితంలో, నా మనసులో రామూకు తప్ప, ఇంకెవరికి స్థానం లేదు. మీరు రామూను చదివించారు. నిజమే. అందుకే ఈ ఐదేళ్లు అతను ఈ కుటుంబ బాధ్యత మోశాడు. నేనూ అడ్డు చెప్పలేదు. అయితే అతను చేసిన అప్పులున్నాయి. అతని కోసం, అతని స్నేహితులు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగివ్వాలి. మా కన్నబిడ్డల్ని పెంచి, ప్రయోజకుల్ని చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకని రాము ఉద్యోగం నేనే చేసుకుంటాను. మీరు ఎవరైనా కాదు.. కూడదూ.. అని అడ్డుపడితే చట్టపరంగా న్యాయపోరాటం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రాము బంధువులుగా మీరు నా ఇంటికి రావచ్చు. మీరు పిలిస్తే నేనూ ఇక్కడకు వస్తుంటాను. ఇదివరకులాగే కష్టసుఖాలు కలిసే పంచుకుందాం. అప్పుడే రాము ఆత్మకు శాంతి. నేను వెళ్లి వస్తాను. దయచేసి నన్ను ఆపటం, గొడవ చేయటంలాంటివి చేసి, నన్ను ఇబ్బంది పెట్టకండి. పెడితే.. తర్వాత మీరు ఇబ్బందిపడాల్సి ఉంటుంది' అంది మైథిలీ.
స్థిర నిశ్చయ కంఠంతో మాటల పిడుగులు కురిపించి.. భుజం మీదో బిడ్డను, చేత్తో మరోబిడ్డను పట్టుకొని, గడప దాటుతున్న మైథిలీని.. కొత్తగా, ఒకింత భయంగా చూస్తుండిపోయారు రామూ నాయక్‌ బంధువులు, దినకర్మకు వచ్చిన తండావాసులు.
వీధి చివరిలో ఆగి ఉన్న పోలీస్‌ జీప్‌ నుండి దిగి, పిల్లలను, మైథిలీని జాగ్రత్తగా జీపు ఎక్కించాడు సునీత భర్త ఎస్‌.ఐ సునీల్‌.

                                                                                         యం.ఆర్‌. అరుణకుమారి    812152 3835