దేశ వ్యాపితంగా న్యాయమూర్తుల ఖాళీలను నింపటం, కోర్టులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించటం, కోర్టుల్ని ఆధునీకరించటం, సమర్ధులైన వ్యక్తులు న్యాయమూర్తులుగా వెళ్లేందుకు ఇష్టపడేలా ఆ వ్యవస్థని రూపుదిద్దటం అవసరం. పని గంటలు పెంచటం కాకుండా ఉన్న సమయంలో సరిగ్గా పని చేసేట్లు ఉన్నత న్యాయస్థానాలు పర్యవేక్షించటం,అనవసరమైన సెలవుల్ని తగ్గించటం, మధ్యవర్తిత్వంలో న్యాయమూర్తుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండటం లాంటి చర్యలకు పూనుకోవటం ద్వారా ఈ పెండెన్సీని గణనీయంగా తగ్గించవచ్చు.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏనాడూ న్యాయమూర్తుల ఖాళీలన్నీ నింపిన పాపాన పోలేదు. ప్రస్తుతం దేశ వ్యాపితంగా 5984 మంది న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం అంటే 78 శాతం బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి పది రాష్ట్రాలలోనే ఉన్నాయి. మొత్తం ఉండాల్సిన 22,677 మంది న్యాయమూర్తుల్లో ఈ సంఖ్య నాలుగో వంతు పైనే అవుతుంది. మొత్తం దేశంలో పెండింగ్‌లో ఉన్న 4 కోట్ల కేసుల్లో 2.72 కోట్ల కేసులు దిగువ కోర్టుల్లోనే కాగా మిగిలినవి దేశం లోని 25 హైకోర్టుల్లోనూ, సుప్రీం కోర్టులోనూ ఉన్నాయి. ఈ పెండింగ్ కేసులు 10 సంవత్సరాలపై నుండి ఉన్నవి 22,57,000 కాగా అందులో కొన్ని రెండు మూడు దశాబ్దాలుగా ఉన్నాయి.
అనేక సంవత్సరాల తర్వాత ప్రస్తుతం సుప్రీం కోర్టుకు పూర్తి స్థాయి (ఒకటి తక్కువ)లో న్యాయమూర్తులున్నారు. పార్లమెంటరీ కమిటి సిఫారసు ప్రకారం ప్రతి పది లక్షల జనాభాకు 50 మంది న్యాయమూర్తులు వుండాలి. అయితే దేశంలో 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ 13 మందిలోనే పైన చెప్పిన ఖాళీలు ఉన్నాయి.
దేశం లోని హైకోర్టుల్లో 1098 న్యాయమూర్తులుండాల్సి ఉండగా అందులో 465 ఖాళీలున్నాయి. 37 మంది ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది మాత్రమే ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులుండాల్సిన తెలంగాణ హైకోర్టులో 21 మంది, 160 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన అలహాబాద్ హైకోర్టులో 68 మంది, 94 మంది ఉండాల్సిన బొంబాయి హైకోర్టులో 33 పోస్టులు, 60 మంది ఉండాల్సిన ఢిల్లీ హైకోర్టులో 31 పోస్టులు, 55 మంది ఉండాల్సిన పంజాబ్ హర్యానా హైకోర్టులో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాపితంగా ఉన్న అన్ని హైకోర్టుల్లోనూ ఇదే పరిస్థితి.
మరోవైపు పెండెన్సీ తగ్గటానికి మధ్యవర్తిత్వం పరమౌషధంగా చాలా మంది న్యాయమూర్తులు ఇటీవల ప్రవచించటమే గాక లోక్ అదాలత్‌లలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పరిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ కక్షిదారులకు ముఖ్యంగా నష్టపరిహారం కోసం ఎదురు చూసే న్యాయార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. సంవత్సరాల తరబడి జరుగుతున్న జాప్యం కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇష్టానుసారంగా విదిల్చే తక్కువ పరిహారానికి అంగీకరించాల్సిన నిస్సహాయ పరిస్థితి వారికి కలుగుతుంది. క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వ పరిష్కారం కారణంగా చాలా కేసులు పరిష్కరించాలని చెప్పుకోవటానికి కోర్టులు పోలీసులపైన ఒత్తిడి చేస్తుంటే, పోలీసులు బాధితులపై ఒత్తిడి చేసి 'మమ' అనిపిస్తున్నారు. దేశంలో ఎక్కువ చోట్ల ఈ పరిష్కారాల్లో న్యాయమూర్తుల పర్యవేక్షణ ఉండటం లేదు. న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇరువురూ కోర్టు బయట చేసుకొనే రాజీలను రికార్డ్ చేసే పనికి న్యాయమూర్తులు పరిమితమవుతున్నారు. అసలే 4 కోట్ల పైచిలుకు కేసుల జాప్యంతో కునారిల్లుతున్న మన న్యాయపాలిక కోవిడ్ కారణంగా మరో 25 శాతం కేసులు పెరగటంతో సతమతమవుతుంది.
''స్వతంత్ర న్యాయ వ్యవస్థ'' అని గప్పాలు కొట్టుకొనే మనం అది నిజమని గుండెలపై చేయి వేసుకొని చెప్పలేం. కింది కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర
ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తోనూ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోనూ చర్చించి హైకోర్టులే చేయవచ్చు. కాని మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఉన్న కోర్టులకు, న్యాయ మూర్తులకే సరైన వసతులు కల్పించటం లేదు. ఖాళీలు నింపే విషయమై సుప్రీంకోర్టు దేశంలోని అన్ని హైకోర్టుల్ని ఆదేశించినా ప్రభుత్వాల అలసత్వం కారణంగా ఇది ముందుకు కదలటం లేదు. కొన్ని కోర్టులు సంఖ్య చెప్పుకోవటానికి ఉన్నా ... న్యాయమూర్తుల కొరత కారణంగా ఇన్‌ఛార్జి జడ్జీలు ఈ కోర్టుల పని పూర్తిగా చేయలేకపోతున్నారు. పైగా పని భారంతో తమ స్వంత కోర్టు పని కూడా చేయలేకపోతున్నారు.
పెండెన్సీకి మరో కారణం ఇబ్బడిముబ్బడిగా ఉన్న సెలవలు. అమెరికా లాంటి దేశాల్లో కోర్టులకు వేసవి సెలవులే ఉండవు. కాని మన దేశంలో అన్ని కోర్టులకూ నెల రోజుల పైనే సెలవులుంటాయి. సంక్రాంతికి, దసరాకి పది రోజుల చొప్పున, శని, ఆదివారాలు కారణంగా సంవత్సరానికి 100 రోజులు, న్యాయమూర్తులకు 20 పబ్లిక్ సెలవులు, 11 ఆప్షనల్ సెలవులు ఉంటాయి. వేర్వేరు కారణాలతో న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు సెలవులు పెట్టటం, న్యాయవాదులు కోర్టులు బహిష్కరించటం, కొన్ని చోట్ల న్యాయవాదులు చనిపోతే ఆ రోజు మొత్తం విధులకు హాజరు కాకపోవటం, మొత్తంపైన సగానికి పైగా పనిదినాలు వృధా అవుతుండగా, పర్యవేక్షణ కొరవడిన న్యాయమూర్తుల పని విధానం కూడా ఈ పెండెన్సీ పెరుగుదలకు కారణమే. గడచిన రెండున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన కేసుల్ని విచారించటానికే హైకోర్టుకు సమయం సరిపోయింది. ఇక పెండెన్సీ పెరగక ఏం చేస్తుంది? ఇప్పటికీ వేల సంఖ్యలోనే ప్రభుత్వంపైన వేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో షుమారు 8 వేలు కోర్టు ధిక్కరణ కేసులే ఉండటం గమనార్హం.
కేసుల్లో జరుగుతున్న జాప్యానికి శాశ్వత పరిష్కారం చూడాలి. షార్ట్‌కట్ ఉపాయాలు సమస్యని పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తాయి. దేశ వ్యాపితంగా న్యాయమూర్తుల ఖాళీలను నింపటం, కోర్టులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించటం, కోర్టుల్ని ఆధునీకరించటం, సమర్ధులైన వ్యక్తులు న్యాయమూర్తులుగా వెళ్ళటానికి ఇష్టపడేలా ఆ వ్యవస్థని రూపుదిద్దటం అవసరం. పని గంటలు పెంచటం కాకుండా ఉన్న సమయంలో సరిగ్గా పని చేసేట్లు ఉన్నత న్యాయస్థానాలు పర్యవేక్షించటం, అనవసరమైన సెలవల్ని తగ్గించటం, మధ్యవర్తిత్వంలో న్యాయమూర్తుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండటం లాంటి చర్యలకు పూనుకోవటం ద్వారా ఈ పెండెన్సీని గణనీయంగా తగ్గించవచ్చు.
(వ్యాసకర్త - ఎ.పి. బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు, గుంటూరు)
చెరుకూరి సత్యనారాయణ










