పీలేరు : అది ఓ తీవ్ర కరువుగాలం. ప్రజలకు తినడానికి తిండి లేదు. పశువులకు మేత కూడా కష్టమైంది. జనం తమ కడుపు నింపుకోడానికి, పశువుల ఆకలి తీర్చడానికి వలస పోయే పరిస్థితులు. అలాంటి సందర్భంలో వజ్రాల వంకపై కట్ట నిర్మాణం పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. కె.వి.పల్లి మండలంలోని గర్నిమిట్ట, చీనేపల్లి, తువ్వపల్లి పంచాయతీ పరిధుల్లోని అనేక పల్లెల ప్రజ లకు ఉపాధి అవకాశం కల్పించింది. ఎందరో నిరు పేదలు, పేదలకు కడుపుకంత బువ్వందించింది. మూడేళ్ళపాటు అక్కడి ప్రజలకు బతుకు తెరువునిచ్చి కరువు కాటకాల నుంచి ఆదుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తైన తరువాత ఏర్పడిన అనావృష్టి కారణాల వల్ల అందులోకి ఆశించిని మేరుకు నీరు చేరక పోయినా, ప్రజల, పశువుల కనీస అవసరాలు తీరేవి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తై, డ్యాంలోకి సమృద్ధిగా నీరు చేరాయి. కుడి కాలువ ద్వారా సుమారు మూడు కిలోమీటర్ల దూరం మేరకు సాగు నీరు అందించింది. ఆ దారిలోని చవటకుంట, రంగారెడ్డి కుంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందించింది. వేయి ఎకరాలకుపైగా భూములు సాగులోకి వచ్చేవి. ఎడమ కాలువ నీటి ద్వారా మల్లార పువాండ్లపల్లి, కిచ్చిలివారిపల్లి వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మేరకు భూములు సాగులోకి వచ్చేవి. ఇవి కాకుండా వజ్రాల వంక డ్యాం పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బావుల్లోనూ నీరు ఆశాజనకంగా అందుబాటులో ఉండేవి. మెట్ట ప్రాంతం భూములు కూడా సాగులోకి వచ్చేవి. ఆప్రాంత రైతన్నలు అన్నానికి కొదవ లేకుండా జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆరేళ్ళ క్రితం కురిసిన వర్షాలకు వజ్రాల వంకలో నీటి ఉధృతి పెరిగడంతో డ్యాం మొరవ నుంచి నీరు అధికంగా పారడంతో డ్యాంకు కుడి, ఎడమ కాలువలు దెబ్బతిని నీరు పూర్తిగా వజ్రాల వంక ద్వారా బాహుదానదిలో చేరి వృథా అవుతున్నాయి. దిగువ ప్రాంతంలోని రెండు కుంటలు, సుమారు 900 ఎకరాల సాగు భూమి బీడుగా మారింది.
వరద నీటిని ఒడిసి పట్టడంలో దిట్ట 'కిచ్చిలి'
వజ్రాల వంక వరద నీటిని ఒడిసి పట్టి వాటిని భూమిలో దాచి పెట్టడంలో దిట్ట అనిపించుకున్నాడు అప్పటి సాగు నీటి సంఘం అధ్యక్షుడు కిచ్చిలి జయరాంరెడ్డి. అక్కడ ఆయన నీటి వృథాను నియంత్రిస్తూ, దిగువ ప్రాంతాల్లోని చవటకుంట, రంగారెడ్డి కుంటలకు నీరు మళ్లించడంలో కీల కంగా వ్యవహరించేవారు. వజ్రాల వంక ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తయ్యాక కూడా ఆయన దాదాపు 20 ఏళ్ల పాటు సాగు నీటి సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రాజెక్ట్‌లోని చుక్క నీరు కూడా వృధా కాకుండా చర్యలు తీసుకుంటూ మల్లారపువాండ్లపల్లి, మిరియాల వాండ్లపల్లి, కొత్తకురవపల్లి, కొత్తవడ్డిపల్లి, రాచపల్లి వారిపల్లి, ముళ్లగోరివారిపల్లి, సర్వోదయ నగర్, ఎర్రగొండక్కగారిపల్లికి చెందిన రైతన్నల నీటి అవసరాలను తీరుస్తూ వారికి తల్లో నాలుకలా వ్యవహరించేవారు.
వంకకు పూర్వ వైభవం తెస్తా
వజ్రాల వంక పూర్వ సాగునీటి సంఘం అధ్యక్షులు కిచ్చిలి జయరాంరెడ్డి తనయుడిగా తాను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సహకారంతో వజ్రాల వంకకు పూర్వ వైభవం సాధించడానికి తన వంతు కృషి చేసి ఈ ప్రాంత అన్నదాతల కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే తన కర్తవ్యంగా భావించి రిపేర్స్, రీస్టోరేషన్, రెనోవేషన్ (ఆర్‌ఆర్‌ఆర్) పథకం ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు కిచ్చిలి వెంకట రమణారెడ్డి తెలిపారు.