Mar 06,2023 23:28

నినాదాలు చేస్తున్న దళిత సంఘం నేతలు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:దళిత యువకుడు హత్యపై స్థానిక ఆర్డిఓ జయరాంకు దళిత సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ముందుగా స్థానిక బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక విలేకరులతో దళిత నాయకులు మాట్లాడుతూ, పాయకరావుపేట మండలంలో గ్రామ దళిత యువకుడు వడ్లమూరి నాగేందర్‌ను గత నెల 28న హత్య చేసిన నిందితులను
తక్షణమే అరెస్టు చేయాలన్నారు. జిఎస్‌సి కన్వీనర్‌ చిట్ల చలపతిరావు మాట్లాడుతూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకో వాలన్నారు. రెళ్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ, నాగేంద్ర కుటుంబానికి ఐదు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం అన్యాయమన్నారు. దళితుల ప్రాణాలంటే ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.అప్పలరాజు, ఆరుగుల రాజబాబు, జి సహదేవుడు, కిడారి మల్లేష్‌, అర్జున్‌, యాదగిరి దాసు, లావరాజు, నాగేశ్వరరావు, డివిజన్‌ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.