Jun 23,2023 02:05
అమర్నాథ్‌ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు

ప్రజాశక్తి-చెరుకుపల్లి: జస్టిస్‌ వర్మ సిఫార్సుల ప్రకారం నిందితులను 45 రోజులలో కఠినంగా శిక్షించాలని, విద్యార్థులు, మహిళల రక్షణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి మనోజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉప్పాల అమర్నాథ్‌పై పెట్రోలు పోసి హతమార్చిన నేపథ్యంలో గురువారం చెరుకుపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దారు కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌ వద్ద వినతిపత్రం అందజేశారు. మహిళలు, విద్యార్థుల రక్షణకు ప్రత్యేక కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, జస్టిస్‌ వర్మ సిఫార్సుల మేరకు ఇటువంటి కేసులలో నిందితులకు వెంటనే కఠినంగా శిక్ష పడే విధంగా 45 రోజులలో శిక్షించేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. అమర్నాథ్‌ సోదరి విద్యాభ్యాసానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని చదివించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తదితర డిమాండ్లు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఐలాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌ మణిలాల్‌, కే శరత్‌ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.