Oct 25,2023 22:31

ప్రజాశక్తి-చల్లపల్లి : మోపిదేవి మండలం కే కొత్తపాలెం గిరిజన మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి మధు మాట్లాడుతూ కే కొత్తపలెంకు చెందిన మత్తి రాజా చంద్‌ యజమాని గిరిజన బాలికను ఇంటికి పని ఉందని పిలిచి దొంగతనం అంటగట్టి తీవ్రంగా కొట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు . యజమానిని ఇదేమిటి అని ప్రశ్నించిన బాధితురాలు బంధువులు ఇద్దరు మహిళలను కూడా అమానుషంగా కొట్టి తీవ్రంగా గాయపరచడం తగదన్నారు. ఆ యజమాని మత్తి రాజా మోపిదేవి పోలీస్‌ స్టేషన్లో గిరిజన బాలికపై కేసు నమోదు చేయగా మోపిదేవి ఎస్‌ఐ మరియు మహిళా కానిస్టేబుల్‌ కలిసి బాధితురాలను కొట్టి చిత్రహింసలకు గురిచేశారని, కావున దాడి చేసిన యజమానినీ, ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ పై ఎస్సీ ,ఎస్టీ చట్టం ప్రకారం శిక్షించాలన్నారు., ఎస్సై ని సస్పెండ్‌ చేసి బాధిత మహిళకు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని, రెండు లక్షలు రూపాయలు నష్టపరిహారం, ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్‌ కె. గోపాల కృష్ణకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బండారు కోటేశ్వరరావు, బుద్దిస్ట్‌ సోడా బత్తిన ఆదినారాయణ, జై భీమ్‌ సంఘం నాయకులు బూసి సుబ్రమణ్యం , వరిగంజి అర్జున్‌ రావు, మాతంగి నరసింహారావు, పరుచూరి జనార్ధన్‌ రావు సిపిఐ ఎంఎల్‌, చాటగడ్డ సుధీర్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బళ్లా వెంకటేశ్వరరావు, లంకపల్లి సత్యనారాయణ, కలపాల దానయ్య, పజవుల్లా ఖాన్‌, మేడంకి వెంకటేశ్వరరావు, గోళ్ళ సాంబశివరావు, ఎండి కరిముల్లా పాల్గొన్నారు.