Jul 22,2023 00:01

నిరసన తెలుపుతున్న నాయకులు, న్యాయవాదులు

ప్రజాశక్తి - రేపల్లె : ఒంగోలులో మోటో నవీన్‌ అనే గిరిజన యువకుడి పై దాడి, మూత్ర విసర్జన చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ రేపల్లెలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎస్‌సి,ఎస్‌టి ప్రజా సంఘాలు, న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం మానవ హారం ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో ముగ్గురు గిరిజన యువతులను నగంగా ఊరేగించి రేప్‌, హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలన్నారు. ఈ సందర్భంగా జైభీమ్‌ భారత్‌ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది దోవా రమేష్‌ రాంజీ మాట్లాడుతూ గిరిజన వర్గాల పైన రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగా దాడులు అత్యాచారాలు హత్యాకాండలు జరుగుతుంటే పాలక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మానవ హక్కులు, రాజ్యాంగ హక్కుల కోసం ఏర్పాటు చేసిన ఎస్‌టి కమిషన్లు ఇలాంటి ఘటనపై సుమోటోగా కేసులు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎస్‌సి,ఎస్‌టి, మైనారిటీలు క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై మానవతవాదంతో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యల స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్యవేదిక ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్‌ ఊసరపు వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సజ్జ పద్మావతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డు బసవ కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కట్టా రవికుమార్‌, యానాది మహానాడు రాష్ట్ర కన్వీనర్‌ కూరేటి మాణిక్యరావు, మాజీ ఎజిపి దారం సాంబశివరావు, మానవ హక్కుల సంఘం ప్రతినిధి నన్నెపాముల చంద్రశేఖర్‌, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా నాయకులు పోలిమెట్ల నాగేశ్వరరావు , జై భీమ్‌ భారత్‌ పార్టీ రేపల్లె మండల కన్వీనర్‌ కర్ర బాబూరావు, సిపిఎం నాయకుడు కనపర్తి రమేష్‌ , బిఎస్‌పి నాయకులు జడ రవీంద్రబాబు న్యాయవాదులు గుంటూరు విజయ కుమారి, చందోలు నాగలక్ష్మి కుమారి, మెండు వెంకట సుబ్బారావు, మునిపల్లె సుబ్బయ్య, కర్ర ప్రతాప్‌, నల్లూరి వెంకటేష్‌ బేతపూడి కోటేశ్వరరావు జీవన్‌ కుమార్‌, గిరిజన ఐక్యవేదిక నాయకులు బొడ్డు సుబ్బారావు, దేవరకొండ నాగేంద్రం, ఎంఆర్‌పిఎస్‌ నాయకుడు నన్నెపాముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.