Jun 14,2023 00:46

మాట్లాడుతున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : నేరానికి పాల్పడిన వ్యక్తికి త్వరితగతిన కోర్టులో శిక్ష పడితే ఇతరులు అలాంటి నేరాలు చేసేందుకు భయ పడతారని, తద్వారా నేరాల సంఖ్య, నేర ప్రవత్తిని కట్టడి చేసి శాంతి భద్రతలు నెలకొల్పోవచ్చని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి పోలీస్‌ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్‌పి కోర్టు మోనిటరింగ్‌ సిస్టంతో పెండింగ్‌ కేసులను త్వరిత గతిన ఎలా విచారణ పూర్తి చేయాలనే విషయంపై సమీక్షించారు. ప్రతి ఒక్క పోలీస్‌ అధికారి తమ పరిధిలో పెండింగ్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న 20 కేసులను ఎంపిక చేసుకోవాలన్నారు. వాటి ట్రయిల్‌ విషయంలో ప్రతిరోజు పర్యవేక్షిం చాలన్నారు. కోర్టు కానిస్టేబుల్‌, కోర్టు సిబ్బంది. న్యాయమూర్తులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కేసు ముందుకు సాగేలా సాక్షులు స్వేచ్ఛగా, నిర్భయంగా సాక్ష్యం చెప్పేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. నిందితులు క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేలాగా చూడాలన్నారు. ఇటీవల జరిగిన నేరాల్లో త్వరగా శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసుల్లో విచారణ త్వరగా పూర్త అయి నేరస్తులకు శిక్ష పడటం వల్ల కొత్తగా నేరం చేయాలనుకునే వాళ్ళకి భయం కలుగుతుందన్నారు. చాలా కాలంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ పూర్తయ్యేలాగా చూసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. విచారణకు హాజరుకాని వారికి వారెంట్‌ జారీ చేయించి కోర్టుకు హాజరు అయ్యేలా చూడాలన్నారు. అధికారులు ఎంపిక చేసుకున్న 20 కేసుల్లో మహిళలపై జరిగిన కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. బుధవారం, గురువారం జిల్లా వ్యాప్తంగా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్‌ సిబ్బంది సచివాలయ మహిళా పోలీసులు, గ్రామ, వార్డు వాలంటీర్లను సమన్వయపరచుకొని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలన్నారు. ప్రతి మహిళ సెల్‌పోన్‌లో దిశ యాప్‌ ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్‌పి తెలిపారు.