Nov 09,2023 19:59

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి-నెల్లూరు :గత నెలలో కావలి జాతీయ రహదారి, ముద్దూరుపాడు సర్వీసు రోడ్డు వద్ద బెంగుళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న విజయవాడ, ఆటోనగర్‌ ఆర్‌టిసి డిపోకు చెందిన బస్సు డ్రైవరు బొందిలి రామ్‌ సింగ్‌ పై దాడికి పాల్పడిన కేసులో ఏ1 ముద్దాయి దేవరకొండ సుధీర్‌ అలియాస్‌ అజరురెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నగరంలోని ఉమేష్‌చంద్రా కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌పై దాడికి సంబంధించిన కేసులో 7 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. రాష్ట్రంలోనే కలకలం సృష్టించిన ఈ ఘటనను జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారణ ప్రారంభించామన్నారు. అందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న దేవరకొండ సుధీర్‌ను అరెస్టు చేశామని తెలిపారు. పోలీసుల తనిఖీల్లో అతని ఇంటిలో ఉన్న రూ.7 లక్షల నగదు, 4 పదునైన కత్తులు, 4 ఎయిర్‌ ఫిస్టల్స్‌, పోలీసులు వినియోగించే 4 హ్యాండ్‌ కప్స్‌, 4 వాకీ టాకీలు, లీడింగ్‌ చైన్లు, 2 సెల్‌ఫోన్‌ సిగ్నిల్స్‌ జామర్లు, ఫోల్డింగ్‌ ఐరన్‌ స్టిక్స్‌, భారీ సంఖ్యలో సెల్‌ఫోన్లు, పలు ల్యాబ్‌ట్యాప్స్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. తెల్లవారు జాము ప్రాంతంలో ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి, అడిషినల్‌ ఎస్‌పి (అడ్మిన్‌) డి.హిమవతి, కావలి డిఎస్‌పి వెంకటరమణ సహకారంతో కావలి, తుఫాన్‌ నగర్‌లోని దేవరకొండ సుధీర్‌ ఇంటిని బెటాలియన్‌ పోలీసు సిబ్బంది, కావలి, నెల్లూరు పోలీసు సిబ్బంది సహకారంతో సోదాలు చేశామన్నారు. ఈ సోదాల్లో రూ.7 లక్షల నగదు, మరణాయుధాలు, ఫిస్టల్స్‌ను , నగదు లెక్కించే మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితుడిపై రాష్ట్రంలో 10 చోట్ల 25 కేసులు నమోదు అయినట్లు గుర్తించామని, అదే విధంగా ఒక ప్రాంతంలో అనుమానితుడిషీట్‌ ఓపెన్‌ చేసినట్లు రుజువైందన్నారు. నిందితుడు తన అనుచరులతో కలిసి అమాయకులను మోసం చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడటమే ప్రధాన నైజంగా మార్చుకొన్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల దేవరకొండ సుధీర్‌ అనుచరులను అదుపులోకి తీసుకున్న సమయంలో ఈ ముఠా సభ్యులవల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ప్రకటించామని, ఈ ప్రకటన వల్ల ఆరు మంది దేవరకొండ ముఠా సభ్యుల వల్ల మోసపోయామంటు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ముఠా సభ్యుల వల్ల ఆర్ధికంగా నష్టపోయిన వారు ఎవరైనా నిరభ్యంతరంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎస్‌పి ప్రకటించారు. ఆర్‌టిసి బస్సు డ్రైవర్స్‌పై దాడికి సంబంధం ఉన్న నిందితులందరినీ అరెస్టు చేయడంలో, ముఖ్యంగా దేవరకొండ సుధీర్‌ను అదుపులోకి తీసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బందికి ఎస్‌పి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో కావలి రూరల్‌ పోలీసు స్టేషన్‌ సిఐ రాజేష్‌,ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.