Aug 21,2023 23:41
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య

ప్రజాశక్తి-బాపట్ల: భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరులో రెండ్రోజుల క్రితం పాఠశాలకి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై స్కూలు పక్కనే కాలనీకి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం దుర్మా ర్గమైన చర్య అని, నిందితుడిని సత్వరమే శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం బాపట్లలోని పుచ్చలపల్లి సుందర య్య ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నెలల క్రితం ఇదే జిల్లాలో చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్‌ చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి అత్యాచారానికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలన్నారు. మహిళలు, చిన్నారులపై ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచారం, హింస వంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వీటిని నివారించలేకపోతోందన్నారు. నిందితులను అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినప్పటికీ బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ఇటువంటి వారికి శిక్ష పడేవరకు బెయిల్‌ రాకుండా జైల్లో ఉంచేందుకు అవసరమైన చట్టాలు చేయాలన్నారు. గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసలవటం వల్ల ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. విచ్చలవిడిగా మద్యం సేవించి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌, ఐద్వా నాయకులు టి సుభాషిణి, ఎస్‌ఎఫ్‌ఐ ఆర్య పాల్గొన్నారు.