ప్రజాశక్తి - రంపచోడవరం
మండలంలోని కాకవాడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ పాఠశాల హెచ్‌ఎం భర్త ప్రసాద్‌పై పొక్సో చట్టం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక ఐటిడిఎ ఎదుట సోమవారం విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి గిరిజన సంఘం నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్ ఎదుటే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులతో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, ఐటిడిఎ అధికారులు బయటకు రావాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ నకిలీ గిరిజనుడైన ప్రసాద్ చేసిన లైంగిక వేధింపులపై పిల్లలు తల్లిదండ్రులతో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటన బయటకు వచ్చినప్పటి నుంచి అధికారులు వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు లోపలకు వెళ్తే పిల్లలు తమ యోగక్షేమాలు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొనే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆశ్రమ పాఠశాలల్లోకి ప్రజాసంఘాలకు అనుమతిని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన జిఒను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పిఎంఆర్‌సి వద్ద ఐటిడిఎ పిఓ సూరజ్ గనోరేను కలిసి వినతిపత్రం అందించారు. దీనికి పిఒ స్పందిస్తూ ఈ సంఘటనపై వెంటనే చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులు, పిల్లల్ని విచారణ చేస్తామని చెప్పారు. కేసు దర్యాప్తునకు సిడిపిఒ, పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇ.సిరిమల్లిరెడ్డి, ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా నాయకురాలు బి.శ్రీదేవి, జనసేన నాయకులు ఎస్.విద్యా సాగర్ రెడ్డి, బాబీ, టి.శ్రీనివాసు, సిఐటియు జిల్లా నాయకులు కె.శాంతి రాజు తదితరులు పాల్గొన్నారు.










